యాప్నగరం

తలనీలాలు సమర్పిస్తే పాపాలు పోతాయా?

దేవుడికి తలనీలాలు సమర్పించడమే సంప్రదాయాన్ని వేదకాలం నుంచి భారతీయులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతంలో కేశఖండనకు ప్రాధాన్యత ఉంది.

Samayam Telugu 3 Apr 2018, 4:53 pm
దేవుడికి తలనీలాలు సమర్పించడమే సంప్రదాయాన్ని వేదకాలం నుంచి భారతీయులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతంలో కేశఖండనకు ప్రాధాన్యత ఉంది. శిరోజాలు పాపాలకు నిలయమని పురాణాలు పేర్కొంటున్నాయి. వాటిని దైవానికి సమర్పిస్తే మన పాపాలను తొలగించుకుంటామని నమ్మకం. శిశువు జన్మించినప్పుడు ముందు తల భాగం బయటకు వస్తుంది. తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి. అందుకే చిన్న వయసులో కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను తనలో దాచుకున్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు. భగవంతుడికి తలనీలాలు సమర్పిస్తామని భక్తితో మొక్కుకుతాం. ఒక విధంగా చెప్పాలంటే మన శిరస్సును దైవానికి అర్పించడానికి బదులు తలనీలాలను ఇస్తాం. దీని గురించి మహాభారతంలో ఓ సంఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu తిరుమలలో కేశఖండన


కౌరవుల సోదరి దుశ్శలను పాండవులు సైతం ఎంతగానో అభిమానించారు. ఆమెకు సింధు దేశపు రాజు జయద్రధుడి (సైంధవుడు)తో వివాహం జరిగింది. కౌరవులతో జూదంలో ఓడిపోయిన పాండవులు ఒప్పందం ప్రకారం వనవాసానికి వెళ్లారు. పాండవుల లేని సమయంలో వరసకు సోదరి అయ్యే ద్రౌపదిని సైంధవుడు అపహరించి, తన రథంపై బంధించి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసిన పాండవులు సైంధవుడిని అడ్డుకుని, ద్రౌపదిని విడిపించారు. ఆవేశంతో భీముడు అతడిని సంహరించబోతే ద్రౌపది వారించింది. సైంధవుడిని చంపితే మీరు ప్రేమగా చూసుకున్న సోదరి దుశ్శల వెధవరాలిగా మారుతుందని అనడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అతడి తల వెంట్రుకలను తీసేస్తే, తలతీసేసినంత పనవుతుందని ధర్మరాజు చెప్పడంతో గుండు గీసి, అవమానించి పంపుతారు. ఈ అవమానభారంతో పాండవులపై ప్రతీకారం తీర్చుకోడానికి సైంధవుడు కఠోర తపస్సు చేశాడు.

ఇక తిరుమలలో శ్రీవారికి కేశఖండన చోటును కల్యాణకట్ట అంటారు. హిందూ సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభం పలకాలనేది పెద్దల భావన. అందుకే క్షవరానికి బదులు కల్యాణమని ఉచ్చరించాలని జనమేజయుని సోదరుడు శతానీకుడు సూచించాడు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చి, కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది. ‘వేం’ అంటే పాపాలు.. ‘కట’ అంటే తొలగించేవాడు. కాబట్టే శ్రీనివాసుని కలౌ వేంకటనాయక అయ్యాడు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకే ఆయన సన్నిధానంలో శిరోజాలు సమర్పించడానికి అంతటి ప్రాధాన్యత ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.