యాప్నగరం

కృష్ణుడికి నీపై ఎందుకంత ప్రేమని వేణువును గోపికలు అడిగితే..

శ్రీకృష్ణుడు బృందావ‌నానికి వెళ్లేటప్పుడు అందులోని ప్రతి ప్రాణి పట్ల ఎంతో ప్రేమ చూపించేవాడు. తమపై కృష్ణుడు చూపుతోన్న ప్రేమకు వనంలోని ప్రతి జీవి సంతోషంతో మురిసిపోయేది.

TNN 3 Mar 2018, 4:30 pm
శ్రీకృష్ణుడు బృందావ‌నానికి వెళ్లేటప్పుడు అందులోని ప్రతి ప్రాణి పట్ల ఎంతో ప్రేమ చూపించేవాడు. తమపై కృష్ణుడు చూపుతోన్న ప్రేమకు వనంలోని ప్రతి జీవి సంతోషంతో మురిసిపోయేది. అయితే ఒక రోజు బృందావ‌నంలోకి భగవానుడు చాలా ఆందోళనతో వచ్చి ఓ వెదురు వృక్షం చెంతన నిలబడ్డాడు. దీన్ని గమనించిన ఆ వృక్షం ‘ఏమైంది కృష్ణా, ఎందుకంత కంగారుగా ఉన్నారు’ అని అడిగింది. ‘నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను... కానీ అది చాలా కష్టమైందని’ కృష్ణుడు అన్నాడు. ‘నీవు అడిగింది నా దగ్గర ఉంటే తప్పకుండా ఇవ్వగలను’ అని ఆ వెదురు చెట్టు బదులిచ్చింది.
Samayam Telugu what secret behind lord krishna loves flute more than gopis
కృష్ణుడికి నీపై ఎందుకంత ప్రేమని వేణువును గోపికలు అడిగితే..


దీంతో జగన్నాటక సూత్రధారి ‘నాకు నీ జీవితం కావాలి.. నిన్ను ముక్కలుగా చేయాలని అనుకుంటున్నాను.. నీకు సమ్మతమేనా’అని అన్నారు. కృష్ణుడు అలా అనేసరికి ఆ వెదురు మొక్క ఒక్కసారి ఆలోచించి.. దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? అని ప్రశ్నించింది. వేరే దారి లేదని పరంధాముడు బదులిచ్చాడు. దీంతో మీరు అనుకున్నట్టుగానే నా జీవితాన్ని తీసుకోండని ఆ వెదురు చెట్టు అంగీకరించింది. అనంతరం భగవానుడు వెదురు మొక్కను ముక్కలు చేసి దానితో పిల్లనగ్రోవి తయారు చేశాడు. పిల్లనగ్రోవికి రంధ్రాలు చేస్తోన్న సమయంలో ఆ వెదురు తనకు కలిగిన నొప్పికి తాళలేక లోలోపల కన్నీరు పెట్టుకుంది.

అయితే తనను ఉపయోగించి అందమైన పిల్లనగ్రోవి తయారుచేయడంతో చాలా ఆనందించింది. నాటి నుంచి కృష్ణుడు రోజంతా వేణువుతోనే గడిపేవాడు. నిద్రలో సైతం పిల్లనగ్రోవిని పక్కన ఉంచుకునేవారు. దీనికి గోపికలు సైతం చాలా అసూయపడ్డారు. మమ్మల్ని కాదని ఆ వేణువుతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడని వేదన చెందేవారు. ఉండబట్టలేక ఒక నాడు పిల్లనగ్రోవిని నిలదీశారు. ‘గోపాలుడు మన అందరికీ దేవుడు.. అలాంటి భగవంతుడు మాతో కొద్ది సమయమే గడుపుతూ నిరంతరం నీ ధ్యాసలో ఉంటారు. దినచర్య నీతో ఆరంభించి, ముగిస్తున్నారు.. ఇందులో మర్మం ఏంటో మాకు చెప్పు.. నిన్ను అంత భద్రంగా చూసుకోవడానికి కారణం ఏంటి? ’ గోపికలు ప్రశ్నించారు.

తనను నిలదీసిన గోపికలకు వేణువు చెప్పిన సమాధానంతో ఙ్ఞానోద‌యం అయ్యింది. ‘నన్ను నేను భగవానుడికి సమర్పించుకున్నాను... నా తనువుపై నాకు ఎలాంటి హక్కు లేదు.. పిల్లనగ్రోవిని తయారుచేసేటప్పుడు నా బాధ వర్ణనాతీతం.. నన్ను ఏం కావాలనుకున్నారో, ఎలా కావాలనుకున్నారో అలాగే మలచుకున్నారు.. అందుకే పూర్తిగా ఆయనకు నేను దాసోహం అయ్యాను అని పిల్లనగ్రోవి తెలిపింది. దీనిని బట్టి తెలిసిందేమంటే భగవంతుడిపై పూర్తిగా విశ్వాసం ఉంచితే, ఆయన మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే తీర్చిదిద్దగలరు. అది మన చేతుల్లోనే ఉంది. ఇందులో ఎలాంటి రహస్యం లేదని వేణువు వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.