యాప్నగరం

Sabarimala: పోలీసులకు బీజేపీ నేత సవాల్.. మరోసారి ఉద్రికత్తలు

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మూడోసారి రెండు నెలల సుదీర్ఘ మండల, మకరు విలక్కు పూజల కోసం శుక్రవారం సాయంత్రం శబరిమల ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే.

Samayam Telugu 18 Nov 2018, 12:52 pm
తలపై ఇరుమడి ధరించి అయ్యప్ప దర్శనానికి వెళ్తోన్న బీజేపీ నేత సురేంద్రన్‌ను శనివారం సాయంత్రం పోలీసులు అడ్డుకోవడంతో ఆదివారం కేరళ బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో, కేరళ బీజేపీ ప్రధాన కార్యదర్శి కే సురేంద్రన్ నిలక్కల్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలతో సహా రోడ్డుపై బైఠాయించి, తనను శబరిమల వెళ్లేందుకు అనుమతించాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు మాత్రం అక్కడ నుంచి సురేంద్రన్‌ను బలవంతంగా వాహనంలో తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ నేతను అడ్డుకోవడంపై పోలీసులు సమర్దించుకున్నారు. ఆయన శబరిమలకు వెళ్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.
Samayam Telugu sabarimala3


అయితే, తాను అయ్యప్ప భక్తుడనని, స్వామిని దర్శించుకోడానికి అనుమతించాలని సురేంద్రన్ కోరారు. అంతేకాదు, లాఠీచార్జ్‌తో తనను అడ్డుకోలేరని, ఆపాలంటే తనను షూట్ చేయడంటూ పోలీసులకు సవాల్ విసిరారు. సురేంద్రన్‌తోపాటు మిగతా భక్తులు అయ్యప్ప నామస్మరణ చేస్తూ బైఠాయించారు. మరోవైపు, తిరువనంతపురంలోని సచివాలయం వద్ద కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. భారీ సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యాన్‌లను ప్రయోగించారు. కేరళవ్యాప్తంగా ఆందోళనకారులు ఎక్కడికక్కడే నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో భారీగా పోలీసులను మోహరించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. శబరిమలలో వివాదానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమంటూ లెఫ్ట్ ప్రభుత్వం ఆరోపించింది.

అయితే, భక్తులకు భద్రత, అవసరమైన మౌలిక వసతుల కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్, బీజేపీలు ధ్వజమెత్తాయి. కేవలం భక్తులకు ఆటంకాలను సృష్టించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ మండిపడింది. సేవ్‌శబరిమల హ్యాష్‌టాగ్ పేరుతో బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవ్యా సైతం ఇదే అంశాన్ని ట్వీట్ చేశారు. కాగా, హిందూ ఐక్యవేదిక అధ్యక్షురాలు శశికళను సైతం శనివారం వేకువజామున సన్నిధానానికి రెండు కిలోమీటర్ల దూరంలో పోలీసులు అడ్డుకున్నారు. దర్శనం కోసం వెళ్తోన్న ఆమెను అడ్డుకోవడంతో హిందూ సంఘాలు శనివారం బంద్ పాటించాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మూడోసారి రెండు నెలల సుదీర్ఘ మండల, మకరు విలక్కు పూజల కోసం శుక్రవారం సాయంత్రం శబరిమల ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.