యాప్నగరం

Kerala High Court: శబరిమల వివాదం.. విజయన్ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు

అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని సెప్టెంబరు 28 సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Samayam Telugu 20 Nov 2018, 3:43 pm
సుప్రీంకోర్టు తీర్పును అమలు జరిపి తీరుతామని భీష్మ ప్రతిఙ్ఞ‌ చేసిన కేరళ ప్రభుత్వం, ఆదివారం అర్థరాత్రి శబరిమల ఆలయంలో దాదాపు 70 మంది భక్తులను అరెస్ట్ చేయించింది. దీంతో మరోసారి కేరళ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. తిరువనంతపురంలోని కేరళ సీఎం పినరయి విజయన్ నివాసంతోపాటు అలప్పూజ, కొచ్చి, అలువా, కోజికోడ్ తదితర ప్రాంతాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ సంఘాలు ఆదివారం భారీ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో, అదుపులోకి తీసుకున్నవారిని విడుదల చేయాలంటూ నిరసన తెలపడమే కాదు, ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన కేరళ హైకోర్టు పినరయి ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. ప్రశాంతతకు మారుపేరైన శబరిమల అయ్యప్ప ఆలయ పరిసరాలను ప్రభుత్వం రణరంగంగా మార్చివేసిందని అభిప్రాయపడింది.
Samayam Telugu Sabari


స్వామి దర్శనానికి వస్తున్న భక్తులను బందిపోట్లలా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, ఆలయం వద్ద 144 సెక్షన్ అవసరమేంటని నిలదీసింది. వారిపై వాటర్ క్యాన్లను ప్రయోగించడం ఏంటని ప్రశ్నించిన న్యాయమూర్తులు, యాత్రికులకు ప్రత్యేకించిన ప్రదేశాల్లో పోలీసులు వారి శిబిరాలకు మాత్రమే పరిమితం కావాలని సూచించింది. భక్తుల అరెస్ట్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన న్యాయస్థానం, నెయ్యాభిషేకం టికెట్‌లను కొనుగోలు చేసిన భక్తులను రాత్రిపూట సన్నిధానంలో ఉండనివ్వాల్సిందేనని స్పష్టం చేసింది. సన్నిధానం వద్ద నియమించిన పోలీసుల అనుభవానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

మరోవైపు, ఈ వ్యవహారంపై స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆందోళనకారులంతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలేనని, వారు కావాలనే ఆలయం వద్దకు వచ్చి ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. భక్తులంటే తమకు ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. శబరిమలలో ఉద్రిక్తతలను సృష్టించడమే వారి ప్రధాన లక్ష్యమని, గతంలో శ్రీచిత్ర తిరునాళ్ ఉత్సవం సందర్భంలోనూ అయ్యప్ప సన్నిధానంలో ఇలాగే వ్యవహరించారని అన్నారు. నెయ్యాభిషేకం టిక్కెట్లు కొనుగోలుచేసిన భక్తులను సన్నిధానం నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీచేయడంతో భక్తులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడం వివాదానికి కారణమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.