యాప్నగరం

శబరిమలలో స్వామికి జరిగే నిత్య కైంకర్యాలు ఇవే!

హరిహరసుతుడు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే పూజలు, అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు. మండలం, మకరం, ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా పూజలు నిర్వహిస్తారు.

TNN 11 Jan 2018, 4:09 pm
హరిహరసుతుడు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే పూజలు, అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు. మండలం, మకరం, ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా నిర్వహించే పూజాదికాలతో పాటూ పంప, ఎరుమేలిల్లోని ఉత్సవాలూ భక్తులకు కనువిందు చేస్తాయి. మండలం, మకర విలక్కు సందర్భాల్లో ఉదయం 7.30 గంటలకు నిర్వహించేది ఉషపూజ. ఈ పూజను మేల్‌సంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ‘ఉష పాయసాన్ని’ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్న సమయంలో తంత్రి ఆధ్వర్యంలో జరిగే పూజ ఉచపూజ. ఈ పూజలో ప్రత్యేకంగా తయారు చేసిన 25 కలశాలను ఉంచి, ఎలనైవేద్యం, ఆరవణ పాయసాలను స్వామివారికి నివేదిస్తారు. రాత్రిపూట అదాజ పూజను మేల్‌సంతి చేస్తారు. ఈ సమయంలో ఎలనైవేద్యం, అప్పంలను నైవేద్యంగా సమర్పిస్తారు.
Samayam Telugu special poojas at sabarimala ayyappa temple
శబరిమలలో స్వామికి జరిగే నిత్య కైంకర్యాలు ఇవే!




సన్నిధానానికి దీక్షతీసుకున్న భక్తుల్ని చేర్చే పద్దెనిమిది మెట్లకు పడి పూజ చేస్తారు. మండలం, మకర విలక్కు సందర్భాల్లో భక్తుల రద్దీని బట్టి పూజను చేసేదీ లేనిదీ నిర్ణయిస్తారు. అయితే మలయాళ మాసాల్లో ఆలయాన్ని తెరిచిన ప్రతి సందర్భంలోనూ పడి పూజ చేస్తారు. ఈ పూజ తంత్రి ఆధ్వర్యంలో, మేల్‌సంతి సహకారంతో జరుగుతుంది. మకరు జ్యోతి దర్శనం తర్వాత, ఆలయాన్ని మూసివేసే ముందు పడిపూజ నిర్వహిస్తుంటారు.

మండల పూజ సమయంలో పదిరోజులపాటు ‘ఉల్సవం’ పేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముందు తంత్రి ఆధ్వర్యంలో ‘కొడిమరం’ అనే ఆచారం ప్రకారం ధ్వజస్తంభం దగ్గర జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలూ, అభిషేకాలూ ఉంటాయి. చివరి రోజున ఉత్సవమూర్తిని గజారోహణంపై ఊరేగించి, పంపకు తీసుకొస్తారు. అక్కడ పవిత్ర స్నానం చేయించి ‘ఆరాట్టు’ వేడుక జరుపుతారు. ఈ కార్యక్రమానికి మేల్‌సంతి ఆధ్వర్యం వహిస్తారు.

మాలికాపురత్తమ్మ శబరిమల నుంచి శరంగుత్తి వరకూ గజారోహం ద్వారా సాగించే యాత్రే ఎజున్నెలిప్పు. అలంకరించిన ఏనుగు మీద అమ్మవారి ప్రతిమను ఉంచి, స్వామి సన్నిధి మీదుగా శరంగుత్తికి తోడ్కొనివస్తారు. అక్కడ కన్నెస్వాములు గుచ్చిన శరాలను చూసి వెనుదిరిగి పదునెట్టాంబడి మీదుగా మాలికాపురత్తమ్మ ఆలయానికి ఈ ఊరేగింపు సాగుతుంది. శరాలను చూసిన ఏనుగు విషణ్ణవదనంతో వెనక్కి వస్తుందని భక్తులు చెబుతారు.


మకర విలక్కు తర్వాత సన్నిధానాన్ని మూసే ముందు రోజు అమ్మవారి ఆలయంలో పందళరాజు నిర్వహించే కార్యక్రమమే గురుథి. ఆ రోజు రాత్రంతా రాజు ఆలయంలోనే ఉంటారు. ఈ సందర్భంలో అక్కడ ఎవరికీ ప్రవేశం ఉండదు.

జ్యోతి దర్శనానికి ముందు రోజు పంపానది తీరంలో భారీ ఎత్తున జరిగే అన్నదాన కార్యక్రమమే పంప సద్య. ఇతిహాసాల ప్రకారం వేటకు వెళ్లిన అయ్యప్ప ఇక్కడే తన సన్నిహితులకు అన్నదానం చేశారనీ, దానికి సంబంధించిందే ఈ కార్యక్రమమనీ అంటారు. అనంతరం పంప విలక్కు పేరుతో దీపాలు వెలిగించిన ఓ పడవను నదిలో వదులుతారు.


ఎరుమేలిలోని వావర్‌ మసీదు దగ్గర ముస్లింలు చేసే వేడుక చందనకుడం. మకర విలక్కు సమయంలోనే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలంకరించిన ఏనుగుల మీద చందన కలశాలు ఉంచి మేళతాళాలతో మసీదుకు వచ్చి అయ్యప్ప స్నేహితుడైన వావర్‌కు నైవేద్యంగా ఇస్తారు.

అంబళ్‌పుజ-అలంగత్‌ పేటతుల్లాల్‌ : సందళ్‌పేట తరువాత అంబళ్‌పుజ, అలంగత్‌ అనే ప్రాంతాల ప్రజలు ఎరుమేలిలో భారీయెత్తున పేటతుల్లాల్‌ అనే వేడుకను జరుపుతారు. వీరంతా వావర్‌ దర్శనం చేసుకుని ఎరుమేలిలో స్నానం చేసే సమయంలో ఓ గరుడ పక్షి వచ్చి అక్కడ తిరుగుతుంది. వీటితోపాటు ఆలయం తెరిచిన సమయంలో నిత్యం సుప్రభాత సేవ, ఘృతాభిషేకాలు, చందనాభిషేకం, పుష్పాభిషేకం, కలశభిషేకం, భస్మాభిషేకం, గణపతి హోమం, హరిహరాసనం లాంటి ధార్మిక విధులను తప్పకుండా నిర్వర్తిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.