యాప్నగరం

Sabarimala Temple: సన్నిధానానికి కిలోమీటరు దూరంలో ఇద్దరు మహిళలు.. మరోసారి ఉద్రిక్తత

తమిళనాడుకు చెందిన 11 మంది మహిళలు అయ్యప్ప దర్శనం కోసం పంబా బేస్ క్యాంప్‌నకు ఆదివారం చేరుకోగా భక్తులు అడ్డుకుని ఆందోళనకు దిగడంతో ఆరు గంటల పాటు వారు నిరీక్షించి వెనుదిరిగారు.

Samayam Telugu 24 Dec 2018, 10:37 am
సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమలలో ప్రవేశించాలన్న 50 ఏళ్లలోపు మహిళల ప్రయత్నాలను అడుగడుగునా భక్తులు అడ్డుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన 11 మంది మహిళలు అయ్యప్ప దర్శనం కోసం పంబా బేస్ క్యాంప్‌నకు ఆదివారం చేరుకోగా భక్తులు అడ్డుకుని ఆందోళనకు దిగడంతో ఆరు గంటల పాటు వారు నిరీక్షించి వెనుదిరిగారు. తాజాగా, 50 ఏళ్లు వయసున్న మరో ఇద్దరు మహిళలు సోమవారం ఉదయం పంబా దాటి సన్నిధానానికి కిలోమీటరు దూరం వరకూ వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పెద్దఎత్తున భక్తులు వారిని అడ్డుకుని మార్గంపై కూర్చుని శరణుఘోషతో నిరసన తెలుపుతున్నారు. దీంతో అదనపు బలగాల కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. సోమవారం ఉదయం పంబకు చేరుకున్న ఈ ఇద్దరు మహిళలూ భక్తుల నిరసనల మధ్యే పోలీసుల సహకారంతో శబరిగిరికి వెళ్లేందుకు నడక ప్రారంభించారు. అయితే, వీరు కొంతదూరం వెళ్లేసరికి మహిళల రాక గురించి సమాచారం తెలియడంతో వేలాది మంది భక్తులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. దీంతో అదనపు బలగాలను రప్పించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Samayam Telugu sabarimala


బలగాలు వచ్చిన తర్వాత వీరిని ఆలయంలోకి అనుమతించే విషయమై నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఇద్దరిలో కోజికోడ్‌కు చెందిన బిందు అనే మహిళ మాట్లాడుతూ... తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుదిరిగేది లేదని స్పష్టం చేసింది. తనపై దాడిచేసినా ఈ రోజు దర్శనం చేసుకోకుండా వెళ్లేది లేదని పేర్కొంది. బిందు శబరిమల వెళ్లిన విషయం తెలుసుకున్న స్థానిక భక్తులు ఆమె నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పంబ వద్దే ఈ ఇద్దర్నీ అడ్డుకోడానికి భక్తులు ప్రయత్నించారని, అయినా వీళ్లు వెనక్కు తగ్గకుండా మొండిగా శబరిమల వైపు ప్రయాణించారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో చాలా మంది దర్శనం కోసం ప్రయత్నించారు. అయితే, ఇంతవరకూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఏ మహిళ కూడా స్వామిని దర్శించుకోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.