యాప్నగరం

వాదనకి దిగిన రోహిత్ శర్మకు జరిమానా..!

రోహిత్ శర్మ సిక్స్‌గా మలచడంతో ఒత్తిడిలో పడిపోయిన ఉనద్కత్ బంతిని ఆఫ్ స్టంప్‌కి దూరంగా..

TNN 25 Apr 2017, 2:19 pm
మైదానంలో ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. వాంఖడే వేదికగా రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బంతిని వైడ్‌గా ఇవ్వనందుకు రోహిత్ శర్మ అంపైర్ ఎస్. రవితో వాదనకి దిగాడు. 161 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి జట్టు విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరంగా కాగా.. పేసర్ ఉనద్కత్ చేతికి పుణె కెప్టెన్ స్టీవ్‌స్మిత్ బంతినిచ్చాడు. తొలి బంతికే హార్దిక్ పాండ్య ఔటవగా.. తర్వాత బంతిని రోహిత్ శర్మ సిక్స్‌గా మలిచాడు. దీంతో ఒత్తిడిలో పడిపోయిన ఉనద్కత్ మూడో బంతిని ఆఫ్ స్టంప్‌కి దూరంగా వైడ్ రూపంలో విసిరాడు. కానీ.. అంపైర్ ఎస్. రవి అనూహ్యంగా వైడ్ ఇవ్వకపోవడంతో క్రీజులో ఉన్న రోహిత్ శర్మ ఆవేశంగా అంపైర్ వద్దకు వచ్చి వాదనకు దిగాడు. తర్వాత బంతికే రోహిత్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బౌలర్ చేతికే చిక్కాడు. ఐదో బంతికి ఒక సింగిల్ రాగా.. చివరి బంతిని హర్భజన్ సిక్స్ కొట్టినా.. ముంబయి 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Samayam Telugu rohit fined 50 of match fees for showing dissent
వాదనకి దిగిన రోహిత్ శర్మకు జరిమానా..!


అంపైర్‌తో వాదనకు దిగడం, నిరసన వ్యక్తం చేయడం క్రికెటర్ల క్రమశిక్షణరాహిత్యం కిందకే వస్తుందని వెల్లడించిన మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్.. కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇలా రోహిత్ శర్మ క్రమశిక్షణ తప్పడం ఇది రెండో సారి. టోర్నీ ఆరంభంలోనే కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై రోహిత్ ఇలానే అంపైర్‌పై అసహనం ప్రదర్శించి రిఫరీ నుంచి హెచ్చరిక అందుకున్నాడు. సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన ముంబయి ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.