యాప్నగరం

ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఉపగ్రహం ఇదే!

ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి ఉపగ్రహాన్ని భారతీయ విద్యార్థులు రూపొందించారు. కలామ్‌శాట్ పేరుతో రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇదే నెలలో ప్రయోగించనుంది.

TNN 5 Jun 2017, 3:54 pm
ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి ఉపగ్రహాన్ని భారతీయ విద్యార్థులు రూపొందించారు. కలామ్‌శాట్ పేరుతో రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇదే నెలలో ప్రయోగించనుంది. ఏడుగురు విద్యార్థుల బృందానికి తమిళనాడుకు చెందిన పద్దెనిమిదేళ్ల యువకుడు రిఫాత్ షరూక్ నాయకత్వం వహించాడు. తన ఆరుగురు సహచరులతో కలిసి రిఫాత్ ప్రపంచంలోనే తేలికైన, చిన్నదైన ఉపగ్రహాన్ని రూపొందించాడు. షరూక్ తండ్రి కూడా శాస్త్రవేత్త కావడంతో చిన్నతనం నుంచి పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నాడు. అయితే తన తొమ్మిదో ఏట తండ్రిని కోల్పోవడంతో శాస్త్రవేత్త కావాలన్న తన కలలను సాకారం చేసుకోడానికి చాలా శ్రమించాడు.
Samayam Telugu seven indian teenagers build worlds lightest satellite to be launched by nasa this month
ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఉపగ్రహం ఇదే!


రిఫాత్ ఏడో తరగతిలో తొలిసారిగా ఓ ప్రాజెక్ట్‌ను రూపొందించాడు. గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీతో కలిసి నాసా 2016లో ప్రకటించిన క్యూబ్స్ ఇన్ స్పేస్ ప్రాజెక్ట్‌లో స్పేస్ కిడ్స్ ఇండియా తరఫున పాల్గొని బృందానికి నాయకత్వం వహించే శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. కిలో బరువు ఉండే క్యూబ్‌శాట్‌ను రూపొందిచడానికి షరూక్ బృందం ముందు ప్రయత్నించింది. అయితే దీనికి అధిక మొత్తంలో పెట్టుబడి అవసరమవుతుందని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఆ ప్రయత్నంలో భాగంగానే కలామ్‌శాట్‌‌ ఆలోచనలు పురుడుపోసుకున్నాయి. కలామ్‌శాట్ పూర్తయిన తర్వాత ప్రయోగానికి ప్రత్యామ్నాయాల గురించి పరిశోధించిన యువ శాస్త్రవేత్తలు సులువుగా అంతరిక్షంలోకి పంపడానికి బెలూన్‌శాట్‌ను అభివృద్ధి చేశారు.

2017 జనవరిలో ఈ ప్రాజెక్ట్ వివరాలను నాసాకు సమర్పించారు. జూన్ 21 న వాలూప్స్ ఐల్యాండ్ నుంచి దీన్ని ప్రయోగించనున్నట్లు నాసా ఏప్రిల్‌లో తెలిపింది. కేవలం 64 గ్రాములు బరువుండే కలామ్‌శాట్ ఉపగ్రహాన్ని 3.8 సెం.మీ. వ్యాసార్థం కలిగిన క్యూబ్స్‌లో అమర్చారు. 3డి ప్రింటెంట్ రీఇన్‌ఫోర్స్‌డ్ కార్బన్ ఫైబర్ పాలిమర్‌ను దీనిలో ఉంచారు. ఈ ప్రయోగం పూర్తివడానికి 240 నిమిషాలు పడుతుందని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.