యాప్నగరం

వర్మ లాంటి వ్యక్తులు 500 ఏళ్లకు ఒకసారి పుడతారు: సివిల్స్ ర్యాంకర్ అక్షయ్

తెలంగాణకు చెందిన సివిల్స్ ర్యాంకర్ ఎడవెల్లి అక్షయ్ కుమార్ తనకు రాంగోపాల్ వర్మ స్ఫూర్తి అని చెప్పి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 11 May 2018, 4:57 pm
తెలంగాణకు చెందిన సివిల్స్ ర్యాంకర్ ఎడవెల్లి అక్షయ్ కుమార్ తనకు రాంగోపాల్ వర్మ స్ఫూర్తి అని చెప్పి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ లేకపోతే తన జీవితం లేదని, ఆయనంటే పిచ్చని అక్షయ్ చెప్పుకొచ్చారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘సివిల్ ఇంజినీరింగ్‌లో తప్పిన వ్యక్తి సివిల్స్ టాపర్‌కు స్ఫూర్తి’ అంటూ బుధవారం వర్మ వరుస ట్వీట్లు పెట్టారు. అంతేకాకుండా అక్షయ్‌ను త్వరలోనే కలుస్తానని కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు.
Samayam Telugu RGV_Akshay


అన్నట్టుగానే గురువారం అక్షయ్‌ను వర్మ కలిశారు. సుమారు ఆరు గంటల పాటు ముచ్చటించారు. కలిసి భోజనం చేశారు. ఈ విషయాన్ని అటు వర్మ, ఇటు అక్షయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఎ సివిల్స్ టాపర్ అండ్ ఎ ఫెయిల్డ్ సివిల్ ఇంజినీర్’ అంటూ అక్షయ్‌తో తీసుకున్న సెల్ఫీని వర్మ ట్వీట్ చేశారు. అయితే ఎక్కడ కలుసుకున్నది వర్మ తన ట్వీట్‌లో వెల్లడించలేదు. కానీ అక్షయ్ మాత్రం తన ఫేస్‌బుక్ పోస్టులో చాలా విషయాలే వెల్లడించారు. అక్షయ్ షేర్ చేసిన ఫొటోలను బట్టి చూస్తుంటే వర్మను ఆయన ముంబై వెళ్లి కలిసినట్టు అర్థమవుతోంది.
‘మొత్తానికి ఆయణ్ని కలుసుకున్నాను. ప్రస్తుతం మన చుట్టూ ఏం జరుగుతున్నాయనే విషయాలపై ఆయనకున్న ఫోకస్, ఆయన ఇంటిలిజెన్స్ చూసి నేను షాకయ్యాను. యునైటెడ్ స్టేట్స్ ఫారన్ పాలసీ, గల్ఫ్ వార్, ఐఎస్ఐఎస్, టాలిబన్, అఫ్ఘాన్ వార్, ముంబై మాఫియా, ఇండో-పాక్ న్యూక్లియర్ వార్, రకరకాల ఫిలాసఫీల గురించి సుమారు 6 గంటలపాటు మేమిద్దం మాట్లాడుకున్నాం. సామాజిక సమస్యల మీద ఇలాంటి అవగాహన ఉండాలంటే నాలాంటి సామాన్యుడు కనీసం ఐదారు సార్లు పుట్టాలి. హ్యాట్స్ ఆఫ్ మై గురు రాంగోపాల్ వర్మ. బుద్ధ, క్రీస్తు వంటి ఇలాంటి వ్యక్తులు 500 ఏళ్లకు ఒకసారి పుడతారు. ఆయనతో కలసి లంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ అక్షయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.