యాప్నగరం

శ్మశానంలో పెళ్లి రోజు వేడుకలు!

సాధారణంగా మనలో చాలా మంది పగటి వేళలో కూడా శ్మశానానికి వెళ్లడానికి భయపడతారు. కానీ గుజరాత్‌కు చెందిన ఒక జంట ఏకంగా అక్కడ పెళ్లి రోజు వేడుకలను నిర్వహించుకోవడానికే ప్లాన్ చేసింది.

TNN 23 Feb 2017, 8:26 pm
సాధారణంగా మనలో చాలా మంది పగటి వేళలో కూడా శ్మశానానికి వెళ్లడానికి భయపడతారు. కానీ గుజరాత్‌కు చెందిన ఒక జంట ఏకంగా అక్కడ పెళ్లి రోజు వేడుకలను నిర్వహించుకోవడానికే ప్లాన్ చేసింది. పెళ్లయ్యాక ఎలాగూ అక్కడికే వెళ్లాలిగా.. అంటారా..? కాసేపు ఆ చర్చను పక్కనబెడదాం. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడానికి ఎవరైనా రొమాంటిక్ లొకేషన్లను ఎంచుకుంటారు కదా.. మరి వీరేంటిలా.. అని ఆరాతీస్తే.. ఆ శ్మశాన వాటిక గార్డెన్‌ను తలపిస్తుందని తేలింది.
Samayam Telugu couple celebrates 25th wedding anniversary in cemetery
శ్మశానంలో పెళ్లి రోజు వేడుకలు!


గుజరాత్‌కు చెందిన సురేష్ చాందీ (50) వినూత్నంగా ఆలోచించారు. ఆయన తన భార్య సుగుణ(47)తో కలిసి.. వారి 25వ పెళ్లి రోజును వైవిధ్యంగా నిర్వహించుకోవాలనుకున్నారు. దీని కోసం ఒక శ్మశాన వాటికను ఎంచుకున్నారు. అందులో ఒక మండపాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి 1800 మందిని ఆహ్వానించారు. అతిథులందరికీ గుజరాతీ వంటకాలను వడ్డించారు.

వేడుకలు మొదలవగానే అక్కడికి ఒక కుటుంబం తమ బంధువుకు అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చింది. వెంటనే అక్కడున్నవారంతా లేచి నిలబడి.. మరణించిన వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పించారు. అంత్య కర్మలు పూర్తయ్యేవరకూ సంగీత కార్యక్రమాలను నిలిపేశారు. సురేష్ చాందీ.. సామాజిక సేవకుడు. ‘ఈ రోజుల్లో శ్మశానాలు.. గార్డెన్లను తలపిస్తున్నాయి. ఈ శ్మశానం కమ్ ఉద్యానవనాన్ని స్థానిక ప్రజల సహకారంతో ఏర్పాటు చేశాం. రోజూ ఇక్కడికి పిల్లలు ఆడుకోడానికి వస్తారు’ అని చెబుతున్నారాయన.

శ్మశానం ఎంట్రెన్స్‌ను పూలు, లైట్లతో అలంకరించారు. గుజరాత్‌లోని వీరంగం గ్రామానికి చెందిన శ్మశాన వాటిక ‘శివ్ మహల్’ ఆహ్లాదాన్ని పంచుతూ.. ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. శ్మశానంలో శివుడు కొలువుంటాడని చెబుతారు కదా మరి! గ్రామస్థుల కోసం సురేష్ చాందీ సొంతంగా ఒక ఆంబులెన్సును కూడా నిర్వహిస్తున్నారు. వైద్య సేవలు అవసరమైన పేదలు, పిల్లలను దీని ద్వారా ఉచితంగా అహ్మదాబాద్‌కు తరలిస్తారు. దీనికయ్యే ఖర్చులన్నీ డొనేషన్ల ద్వారానే వస్తున్నాయట. పెళ్లైన 23 ఏళ్ల తర్వాత ఈ దంపతులకు సంతానం కలగడం మరొక ఆశ్చర్యం గొలిపే అంశం.

చాలా మంది పగటి వేళలోనే శ్మశానానికి వెళ్లడానికి భయపడతారు. కానీ సురేష్ చాందీ ఆ అనధికారిక నిషిద్ధాన్ని ఛేదించారు. దేనికైనా.. మనసుంటే మార్గముంటుందని నిరూపించారు కదా! మీరూ ట్రై చేస్తారా మరి.
- శేయర్ రావల్, అహ్మదాబాద్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.