యాప్నగరం

బొమ్మ తుపాకీతో బ్యాంక్ లూటీకి ప్లాన్!

బొమ్మ తుపాకీతో బ్యాంక్‌కు కన్నం వేద్దామనుకున్నాడో యువకుడు. ధైర్యం చాలుతుందో లేదో అని కాసింత మద్యం కూడా పుచ్చుకున్నాడు..

TNN 21 Mar 2017, 1:44 pm
బొమ్మ తుపాకీతో బ్యాంక్‌కు కన్నం వేద్దామనుకున్నాడో యువకుడు. ధైర్యం చాలుతుందో లేదో అని కాసింత మద్యం కూడా పుచ్చుకున్నాడు. ఆ బ్యాంక్‌కు చెందిన ఓ ఉద్యోగి అత్యంత సాహసం ప్రదర్శించి అతణ్ని అడ్డుకోవడంతో అసలు విషయం బయటపడి, కటకటాల పాలయ్యాడు ఆ ప్రబుద్ధుడు. అహ్మదాబాద్‌కు చెందిన కమలేశ్ శర్మ తండ్రికి ఎస్‌బీఐ నైకోల్ శాఖలో సేవింగ్స్ ఖాతా ఉంది. దీనికి సంబంధించిన లావాదేవీల నిమిత్తం అతడు తరచూ ఆ బ్యాంక్‌కు వెళతాడు. అందువల్ల అతడికి ఆ బ్యాంక్‌లో ఏ మూలన ఏముంటుందో ప్రతీది తెలుసు. సాధారణంగా క్లోజింగ్ టైమ్‌కు కాస్త ముందు.. బ్యాంక్ సిబ్బంది ఎంట్రన్స్ షెటర్లను సగం వరకు దించి, లెక్కలను సరి చూసుకుంటారు. ఇలాంటి విషయాలను జాగ్రత్తగా గమనించిన కమలేశ్.. సోమవారం (మార్చి 20) సాయంత్రం 4.30 గంటలకు బ్యాంక్‌లో నగదు దోపిడీకి ప్రయత్నించాడు.
Samayam Telugu drunk man attempts bank loot with toy gun
బొమ్మ తుపాకీతో బ్యాంక్ లూటీకి ప్లాన్!


సగం తెరచి ఉన్న తలుపుల ద్వారా కమలేశ్.. నేరుగా క్యాషియర్ దగ్గరకు పరుగెత్తుకొచ్చి తుపాకీ ఎక్కుపెట్టాడు. ఎవ్వరూ కదలవద్దంటూ బ్యాంక్ సిబ్బందిని హెచ్చరించాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి ముసుగు వేసుకున్నాడు. బ్యాంక్ సిబ్బంది షాక్ నుంచి తేరుకోక ముందే.. అందులో ఒక ఉద్యోగి కమలేశ్ వెనక నుంచి వచ్చి.. అదను చూసి.. అతడి చేతిలోని రివాల్వర్‌ను లాగేసుకున్నాడు. దీంతో మిగతా సిబ్బంది కూడా తలో చెయ్యేసి, కమలేశ్‌ను పట్టుకున్నారు. విషయాన్ని పోలీసులకు చేరేయడంతో.. వాళ్లు వచ్చి కమలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు తీసుకొచ్చింది నిజమైన గన్ కాదని వాళ్లు తేల్చారు. మార్కెట్లో.. సిగరెట్లను వెలిగించుకోవడానికి ఉపయోగించే లైటర్లు కొన్ని తుపాకీ ఆకృతిలో లభ్యమవుతున్నాయి. కమలేశ్ అలాంటి ఒక లైటర్‌ను కొనుక్కొచ్చి దోపిడీకి స్కెచ్ వేశాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.

‘ఎవరైనా దోపిడీకి పాల్పడితే బ్యాంక్ సిబ్బంది ఏ మేరకు సన్నద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి మాక్ డ్రిల్ చేశా’ అని.. కమలేశ్ పోలీసులకు చెప్పడం కొసమెరుపు. వాళ్లు తమదైన శైలిలో విచారించగా అతడు అసలు నిజం కక్కేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.