యాప్నగరం

విధి చేతిలో ఓడిన తల్లి.. పాల కోసం ఏడ్చిన చిన్నారి!

కన్నబంధం కళ్ల ముందే కూలిపోయినా.. అమ్మ అనే నమ్మకాన్ని మాత్రం వదులుకోలేని ఆ బాలుడు తల్లి పాల కోసం ఆరాటపడటం అందరినీ కంటతడి పెట్టించింది.

TNN 10 Jun 2017, 5:19 pm
ఆ రెండేళ్ల చిన్నారికి తల్లి ఇక లేదన్న నిజం తెలియదు. ఆమె శవం పక్కనే కూర్చొని, ఆకలికి తాళలేక ఏడవడం మొదలుపెట్టాడు. అయినా ఆమె లేవకపోవడంతో.. మృతదేహంపై కూర్చొని పాల కోసం మారాం చేశాడు. ఏడ్చి ఏడ్చి.. అలాగే తల్లి పార్థివదేహంపైనే నిద్రించాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. గురువారం (జూన్ 8) రాత్రి 10 గంటల సమయంలో సుమారు 35 ఏళ్ల వయసున్న మహిళ తన రెండేళ్ల కుమారుడితో ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌‌లోకి వచ్చింది. ఫ్లాట్‌ఫాంపైకి చేరుకుంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి, ప్రాణాలు విడిచింది. గమ్యస్థానానికి వెళ్లే హడావుడిలో ఉన్న ప్రయాణికులు చాలా సేపటి వరకు దీన్ని గమనించలేదు. కొంత సేసటి తర్వాత చిన్నారి ఏడుపులు విన్న కొంత మంది అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఆమె మరణించినట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Samayam Telugu pathetic scenario mother dies 2 years old boy cries for milk
విధి చేతిలో ఓడిన తల్లి.. పాల కోసం ఏడ్చిన చిన్నారి!


చుట్టుపక్కలవాళ్లు పాలు, బిస్కెట్లు ఇచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా.. ఆ బాలుడు తీసుకోలేదు. అలాగే గంటల తరబడి వెక్కి వెక్కి ఏడ్చి.. చివరికి వేకువజాము వరకు తల్లి మృతదేహంపై అలాగే నిద్రించాడు. తెల్లవారుజామున సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలుడిని తమ సంరక్షణలో ఉంచుకున్నారు.

కన్నబంధం కళ్ల ముందే కూలిపోయినా.. అమ్మ అనే నమ్మకాన్ని మాత్రం వదులుకోలేని ఆ బాలుడు తల్లి పాల కోసం ఆరాటపడటం అందరినీ కంటతడి పెట్టించింది. ఆ మహిళ ఆచూకీ తెలిసిన వారు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులను సంప్రదించాలి. ఇటీవల మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 17 నెలల ఒక బాలుడు అమ్మ మృతదేహం నుంచి తల్లి పాలు తాగుతున్న ఫోటో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.