యాప్నగరం

శశికళ అంటే జయకు ఎందుకంత ఇష్టం?!

ఒక సందర్భంలో జయలలిత, శశికళ పూల దండలు కూడా మార్చుకున్నారు.

TNN 6 Dec 2016, 11:05 am
ఒకే రకమైన దుస్తులు.. ఒకే రకమైన ఆభరణాలు ధరిస్తారు.. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తారు.. ఆఖరుకు జైలుకైనా సరే. ఒకరిని విడిచి ఒకరు క్షణకాలం కూడా విడిచి ఉండలేనంత బంధం వారిది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆమె నెచ్చెలి శశికళా నటరాజన్ అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అంతగా వారి గురించి దక్షిణాది అంతటా తెలుసు.
Samayam Telugu relation between tamilnadu cm jayalalithaa and sashikala
శశికళ అంటే జయకు ఎందుకంత ఇష్టం?!


జయ, శశికళల అనుబంధం ఈనాటిది కాదు. 1980ల నుండే అది కొనసాగుతోంది. కాకపోతే అది 1991లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత అది వెలుగుచూసింది.


శశికళ ఒకప్పుడు వీడియో క్యాసెట్ల విక్రేత: జయలలిత రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో అన్నాడీఎంకె ప్రచార వ్యవహారాలు చూసేవారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ కార్యక్రమాలకు ప్రచారానికి సంబంధించిన వీడియో క్యాసెట్లు శశికళ నడిపే వీడియో క్యాసెట్ల దుకాణం నుండి వెళ్లేవి. వాటిని తీసుకుని శశికళ జయను కలిసి ఇస్తుండేవారు. అలా వారి పరిచయం ప్రారంభమైంది. ఆ తరువాత నుండి ఆమె జయతోనే ఉండిపోయారు. జయతో పరిచయానికి ముందే శశికళకు వివాహమైంది. ఆమె భర్త తమిళనాడు ప్రభుత్వంలో పౌరసంబంధాల అధికారిగా పనిచేసేవారు. ఎమర్జెన్సీ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో కుటుబ పోషణకు ఆయన శశికళను వీడియో క్యాసెట్ల దుకాణాన్ని పెట్టేలా ప్రోత్సహించారు. అనంతరం ఆయన తనకున్న పరిచయాలతో భార్య నడిపే వీడియో క్యాసెట్ల దుకాణం నుంచే అన్నాడీఎంకే ప్రచార కార్యకలాపాలకు అవసరమైన వీడియోలు వెళ్లేలా పావులు కదిపారు. శశికళలో ఏం నచ్చిందో ఏమో కానీ జయ ఆమెను ప్రాణసమానంగా అభిమానించడం ప్రారంభించారు. అది ఎంతవరకు వెళ్లిందంటే శశికళ భర్తకు కూడా వారి బంధంపై అసంతృప్తి కలిగేంతగా వెళ్లింది. కానీ, కాలక్రమేణా ఆయన కూడా వారి బంధానికి అంగీకారం తెలిపారు.

జయతో సన్నిహితంగా ఉంటూనే శశికల తన కుటుంబ కార్యకలాపాలు చక్కదిద్దుకుంటారు. పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా జయకు నీడ (షాడో)లా వెన్నంటి నిలిచారు. కొన్ని కారణాల వల్ల వివాహం చేసుకోకుండానే ఒంటరిగా మిగిలిపోయిన జయలలితకు శశికళే అన్నీ తానై నిలిచారు. శశికళ స్కూల్ డ్రాపవుట్. ఒకప్పుడు భర్త చాటు భార్య. మంచిమనసు గల మహిళగా ఆమెకు పేరున్నప్పటికీ ఆమెను జయ (జైలు కెళ్లిన సందర్భాల్లో) తాత్కాలిక సీఎం చేయలేకపోయారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో శశశికళ అతిగా జోక్యం చేసుకుంటున్నారనే ప్రచారంతో తమిళ జనబాహుళ్యంలో ఆమెపై వ్యతిరేకత ఉండటమే దానికి కారణం. కానీ, బయటకు తెలియని విషయమేమిటంటే, జయ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల ఆలోచన శశికళ బుర్ర నుండే వచ్చాయని అన్నాడీఎంకే వర్గాలంటూ ఉంటాయి. పేదలంటే శశికళకు గల అభిమానం. ఒకప్పుడు కటిక లేమితనం అనుభవించి ఉన్న శశికళ తన అనుభవాల పాఠంతో తమిళనాడులో నిరుపేదలకు జయ పలు స్కీములు ప్రకటించేలా చేయగలిగారనే దానిలో వాస్తవం ఎంతో మనకు తెలియదు.

ప్రియసఖి జయలలితతో శశికళ జైలుకు కూడా పలుమార్లు వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న జయకు అడుగడుగునా శశికళ అన్నీ తానై చూసుకునేవారు. అపోలో ఆసుపత్రిలో కూడా జయ బాగోగులు శశికళే చూసుకున్నారు. చాలా కాలం ఇద్దరూ ఒకే రకమైన చీరలు కట్టుకున్నారు, ఒకే రకమైన ఆభరణాలు ధరించేవారు. చెప్పులు కూడా ఒకే రకంగా ఉండేవి.

ఒక సందర్భంలో వారిద్దరూ దండలు కూడా మార్చుకోవడం దేశ వ్యాప్తంగా ఆకర్షించింది. అప్పట్లో అదో పెద్ద వార్త. చాలాకాలం వరకు వారు ఒకే రకమైన చీరలు కట్టుకునేవారు. చెప్పుల నుండి ఆభరణాలు కూడా ఒకే రకమైనవి వాడేవారు. అలాంటి వారి బంధంలో కొన్నిమార్లు మనస్పర్థలు కూడా వచ్చాయి. పార్టీ నుండి శశికళను బహిష్కరించిన సందర్భాలున్నాయి. శశికళ కుటుంబంపై పోలీసు కేసుల వరకు జయ వెళ్లారు. కానీ, నెలలు తిరిగేలోపే వారు మళ్లీ ఒకటయ్యారు.

ఇప్పుడు జయ మరణంతో శశికళ ఒంటరయ్యారని చెప్పకతప్పదు. భర్త, కుటుంబం ఉన్నప్పటికీ వారిని మించిన అనుబంధం తన ప్రియసఖి జయతో శశికళ అనుబంధం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.