యాప్నగరం

ఫేస్‌బుక్‌లో యువతిని ఎరవేసి యువకుడి హత్య!

ఓ వ్యక్తి హత్య వెనుక యువకుడి పాత్ర ఉందని నమ్మిన అతడి కుటుంబ సభ్యులు యువతని ఫేస్‌బుక్‌లో ఎరగావేసి పథకం ప్రకారం అంతం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

TNN 23 Jun 2017, 1:24 pm
ఫేస్‌బుక్ ద్వారా యువతిని ఎరగా వేసి ఓ యువకుడిని హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కంకిపాడు మండలం పునాదిపాడు సమీపంలో ఓ కార్పొరేట్‌ కళాశాల దగ్గర షేక్‌ రఫీ అనే యువకుడు దారుణహత్యకు గురైన ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన 26 ఏళ్ల షేక్‌ రఫీకి కొద్ది రోజుల కిందట ఫేస్‌బుక్‌లో ఓ యువతితో ఏర్పడిన పరిచయం స్నేహానికి దారితీసింది. బుధవారం ఆమె నుంచి ఫోన్‌ రావడంతో రఫీ తన స్నేహితుడు షేక్‌ అబ్దుల్‌ జబ్బాతో కలిసి ద్విచక్రవాహనంపై రాత్రి 8 గంటల సమయంలో పునాదిపాడు వచ్చాడు. ఫోన్‌ చేసిన యువతి గురించి ఆరా తీస్తున్న సమయంలో ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రఫీ, మున్నాలపై కత్తులతో దాడి చేశారు. మున్నా స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్నాడు.
Samayam Telugu vijayawada man lured to meet facebook friend murdered
ఫేస్‌బుక్‌లో యువతిని ఎరవేసి యువకుడి హత్య!


ఈ దాడి నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు పరుగు తీసిన రఫీ జాడ బుధవారం అర్ధరాత్రి వరకూ తెలియలేదు. రఫీ కుటుంబ సభ్యులు, స్నేహితులు గురువారం పునాదిపాడు వచ్చి అతడి కోసం గాలించగా, దాడి జరిగిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయడంతో రఫీ ఎడమచేయి, తలకు తీవ్రగాయాలయ్యాయి.

రఫీ హత్య వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. గత నెల 2 న మంగళగిరికి చెందిన కనకారావు అనే వ్యక్తి హత్యతో రఫీకి సంబంధం ఉందని ఆయన కుటుంబ సభ్యులకు అనుమానం ఉంది. ఈ నేపథ్యంలోనే రఫీని పథకం ప్రకారం ఉచ్చులోకి దించినట్లు తెలుస్తోంది. అతడి హత్య కోసమే ఫేస్‌బుక్‌ ద్వారా యువతిని పరిచయం చేసి సంఘటన స్థలానికి రప్పించి హత్య చేశారని రఫీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రఫీ కదలికలను మొదటి నుంచి శత్రువులు గమనించి హత్య చేశారనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని డీసీపీ రాణా, ఈస్ట్‌ జోన్‌ ఏసీపీ విజయ్‌భాస్కర్‌ పరిశీలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.