యాప్నగరం

సింహాల కాపలా మధ్య ప్రసవించిన మహిళ!

పురిటి నొప్పులు అనుభవిస్తున్న ఓ మహిళ సింహాల గర్జనల మధ్య ఆంబులెన్సులోనే ప్రసవించింది. పది నుంచి పన్నెండు సింహాలు..

TNN 30 Jun 2017, 7:14 pm
పురిటి నొప్పులు అనుభవిస్తున్న ఓ మహిళ సింహాల గర్జనల మధ్య ఆంబులెన్సులోనే ప్రసవించింది. పది నుంచి పన్నెండు సింహాలు మెడికల్ ఎమర్జెన్సీ వాహనాన్ని ముందుకు కదలకుండా చుట్టేయడంతో ఈ పరిస్థితి ఎదురైంది. గుజరాత్‌ రాష్ట్రంలోని ఆమ్రేలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం (జూన్ 28) రాత్రి లున్సాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు ఎక్కువడంతో.. కుటుంబ సభ్యులు 108 ఆంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆంబులెన్స్ సిబ్బంది ఆ మహిళను వాహనంలో ఎక్కించుకొని 3 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లగానే.. రోడ్డుపై ఓ సింహాల గుంపు ఉండటాన్ని డ్రైవర్ గమనించాడు. సింహాలు వెళ్లిపోయిన తర్వాత ముందుకు పోదామనే ఉద్దేశంతో అతడు వాహనాన్ని రోడ్డుపై నిలిపేశాడు. కానీ, అవి ఆంబులెన్సు చుట్టూ చేరి గర్జించడం మొదలు పెట్టాయి.
Samayam Telugu woman delivers baby in ambulance surrounded by pride of lions
సింహాల కాపలా మధ్య ప్రసవించిన మహిళ!


ముందుకు కదలడానికి ఆ సింహాలు ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం.. మరోవైపు మహిళకు రక్తస్రావం తీవ్రతరం అవుతుండటంతో ఆంబులెన్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. వాహనాన్ని అలాగే నిలిపేసి.. అందులోనే ఆమెకు పురుడు పోశారు. ఫోన్ ద్వారా వైద్యురాలిని సంప్రదించి.. ఆమె సూచనల మేరకు వ్యవహరించారు. 25 నిమిషాల తర్వాత.. ఆ మహిళ సింహాల కాపలా మధ్య తన నాలుగో సంతానానికి సగర్వంగా జన్మనిచ్చింది.

చివరికి సింహాల గుంపు పక్కకు తప్పుకున్న తర్వాత సదరు మహిళను ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు తల్లీబిడ్డా అక్కడ క్షేమంగా ఉన్నారు. ఆమ్రేలీ ప్రాంతంలోని గ్రామాల పరిధిలో తరచూ ఇలా సింహాలు తిరుగుతుంటాయని, వాటితో ఎలా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి తమకు తర్ఫీదు ఇచ్చారని ఆంబులెన్సులో సేవలందిస్తున్న చేతన్ గదియా తెలిపారు.

సరైన రహదారి మార్గాలు లేకపోవడంతో కొన్ని గ్రామాల్లోకి వాహనాలు వెళ్లడం కూడా కష్టమని, అలాంటి సందర్భాల్లో కిలోమీటర్ దూరం వరకూ బాధితులను మోసుకెళ్లాల్సి ఉంటుందని చేతన్ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.