యాప్నగరం

బంగ్లా సంచలనం, సెమిస్ రేసులో నిలిచింది!

ఈ సారి బంగ్లా గెలవడం సంచలనం కాదు, గెలిచిన తీరు సంచలనం. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో

TNN 10 Jun 2017, 8:47 am
ఐసీసీ ఈవెంట్స్ లో సంచలనాలు నమోదు చేయడాన్ని అలవాటుగా చేసుకున్న బంగ్లాదేశ్ మరోసారి అలాంటి విజయాన్ని సాధించింది. ఈ సారి బంగ్లా గెలవడం సంచలనం కాదు, గెలిచిన తీరు సంచలనం. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగి, 33 పరుగులకే నాలుగు వికెట్లు పడిపోయిన దశ నుంచి బంగ్లాదేశ్ అనూహ్యంగా కోలుకుని విజయంతో సంచలనం సృష్టించింది. షకిబ్ 114 పరుగులతో, మహ్మదుల్లా 102(నాటౌట్)తో బంగ్లాను గెలిపించారు.
Samayam Telugu bangladesh in semis race
బంగ్లా సంచలనం, సెమిస్ రేసులో నిలిచింది!


కార్డిఫ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బంగ్లాకు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విలియమ్సన్, రాస్ టేలర్లు అర్ధసెంచరీలు చేయడంతో కివీస్ ఆ గౌరవప్రదమైన స్కోరును నమోదు చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో మొసాదిక్ మూడు ఓవర్లు మాత్రమే వేసి మూడు వికెట్లు తీశాడు. తస్కిన్ రెండు వికెట్లు రుబెల్, ముస్తాఫిజుర్ లు చెరో వికెట్ తీశారు. బౌలింగ్ లో రాణించిన బంగ్లా ఛేదనలో ఆదిలో ఎదురుదెబ్బలు తింది.

రెండో బంతికే ఓపెనర్ తమీమ్ ను పెవిలియన్ కు పంపాడు సౌథీ. మూడో ఓవర్ లో సౌమ్య సర్కార్ కూడా సౌథీ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. ఆ తర్వాత షబ్బీర్ రెహ్మాన్ ను కూడా ఔట్ చేశాడు సౌథీ. మరో వైపు మిల్నే బౌలింగ్ లో ముష్ఫికర్ బౌల్డ్ కావడంతో బంగ్లా పనైపోయిందని అంతా అనుకున్నారు. దారుణ ఓటమి తప్పదనుకున్నారు. ఆ దశలో జతకలిసిన షకిబ్, మహ్మదుల్లాలో వడివడిగా విజయ లక్ష్యం వైపు సాగారు. ఈ జోడీని విడగొట్టడానికి కివీస్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మొత్తం ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ప్రయోజనం లేకపోయింది.

విజయం ముంగిటకు వచ్చాకా షకిబ్ ఔట్ అయ్యాడు. అప్పటికే బంగ్లా విజయం ఖరారు అయ్యింది. మిగతా పనిని మహ్మదుల్లా, మొసాదిక్ లు పూర్తి చేశారు. ఈ ఓటమితో కివీస్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. విజయంతో బంగ్లాదేశ్ కూడా సెమిస్ రేసులో నిలిచింది. మూడు మ్యాచుల్లో ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో మొత్తం మూడు పాయింట్లను సంపాదించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల మధ్య జరిగే మ్యాచ్ పై బంగ్లా సెమిస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే.. ఆసీస్ ఇంటికి వెళుతుంది. బంగ్లా సెమిస్ చేరుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.