యాప్నగరం

IND vs WI 2019: వెస్టిండీస్‌ జట్టుతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

భారత్ జట్టు గురువారం నుంచి వెస్టిండీస్ మెయిన్ టీమ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుజారా శతకంతో ఫామ్‌ అందుకోగా, రహానె, రోహిత్, విహారి హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

Samayam Telugu 20 Aug 2019, 10:36 am

ప్రధానాంశాలు:

  • భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం నుంచి టెస్టు సిరీస్ మొదలు
  • ప్రాక్టీస్ మ్యాచ్‌లో శతకం బాదిన చతేశ్వర్ పుజారా
  • హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న రోహిత్, రహానె, విహారి
  • రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫెయిలైన రిషబ్ పంత్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu IND vs WI 2019
Image Courtesy: BCCI Twitter
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కి ముందు భారత్ జట్టుకి మంచి ప్రాక్టీస్ లభించింది. ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్-ఎ జట్టుతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (100 రిటైర్డ్ హర్ట్: 187 బంతుల్లో 8x4, 1x6) శతకం బాదగా.. రోహిత్ శర్మ (68), అజింక్య రహానె (54), హనుమ విహారి (64) అర్ధశతకాలతో సత్తాచాటారు. మరోవైపు వెస్టిండీస్-ఎ టీమ్ నుంచి నామమాత్రపు పోటీ ఎదురైనా.. ఆఖరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. చేతి వేలి గాయం కారణంగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కి విరాట్ కోహ్లీ దూరమవగా.. అతని స్థానంలో అజింక్య రహానె తాత్కాలిక కెప్టెన్‌గా జట్టుని నడిపించాడు.
శనివారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌ని 297/5 వద్ద డిక్లేర్ చేసింది. పుజారా శతకం, రోహిత్ హాఫ్ సెంచరీ సాధించగా.. రిషబ్ పంత్ (33) నిరాశపరిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ జట్టు 56.1 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. భారత్‌కి 116 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్ తలో మూడేసి వికెట్లు పడగొట్టారు.

శతక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించిన భారత్ జట్టులో అజింక్య రహానె (54: 162 బంతుల్లో 5x4, 1x6), హనుమ విహారి (64: 125 బంతుల్లో 9x4, 1x6) అర్ధశతకాలు బాదారు. అయితే.. వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ రిషబ్ పంత్ (19: 31 బంతుల్లో 3x4) ఫెయిలైపోయాడు. దీంతో.. రెండో ఇన్నింగ్స్‌ని 188/5 వద్ద డిక్లేర్ చేసిన భారత్ జట్టు.. విండీస్‌కి 305 పరుగుల టార్గెట్‌ని నిర్దేశించింది.

305 పరుగుల భారీ లక్ష్య ఛేదనకి దిగిన వెస్టిండీస్ జట్టు ఆరంభంలోనే వరుసగా వికెట్లు చేజార్చుకుని 40/3తో నిలవగా.. ఆ తర్వాత జాన్ మహ్మద్ (2 నాటౌట్: 24 బంతుల్లో), కార్టెర్ (1 నాటౌట్: 20 బంతుల్లో) సహనంతో క్రీజులో నిలిచారు. మ్యాచ్‌ టైమ్ ముగిసే సమయానికి వెస్టిండీస్ 21 ఓవర్లలో 47/3తో నిలవడంతో గేమ్ డ్రాగా ముగిసింది.. రెండో ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్, జడేజా ఒక్కో వికెట్‌తో ఫర్వాలేదనిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.