యాప్నగరం

IPL 2021 సీజన్‌కి పవర్ హిట్టర్‌పై కన్నేసిన CSK.. ధోనీ డైరెక్షన్

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఘోరంగా విఫలమైన పవర్ హిట్టర్‌ని ఈ ఏడాది వేలంలో దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ పట్టుదలతో ఉంది. ఒకవేళ అతను టీమ్‌లోకి వస్తే..? ధోనీ డైరెక్షన్‌లో చెలరేగడం ఖాయమని ఆ ఫ్రాంఛైజీ ధీమాతో ఉంది.

Samayam Telugu 24 Jan 2021, 8:24 am
ఐపీఎల్ 2020 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, మోనూ సింగ్, పీయూస్ చావ్లాని వేలంలోకి వదిలేసిన చెన్నై ఫ్రాంఛైజీ.. రిటైర్మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్‌నీ రిలీజ్ చేసింది. మొత్తంగా 18 మంది ఆటగాళ్లని మాత్రమే అట్టిపెట్టుకున్న చెన్నై.. ఫిబ్రవరిలో జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్‌ వేలంలో ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్‌‌ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu Glenn Maxwell (Image Source: BCCI/IPL)


వాస్తవానికి ఐపీఎల్ 2020 సీజన్‌లో మాక్స్‌వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌కి ఆడిన మాక్స్‌వెల్.. 13 మ్యాచ్‌ల్లో 108 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో అతని సగటు 15.42కాగా.. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. దాంతో.. ఐపీఎల్ 2020 సీజన్ కోసం మాక్స్‌వెల్‌ని రూ.10.75 కోట్లకి కొనుగోలు చేసిన పంజాబ్ ఈసారి వేలంలోకి వదిలేసింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆ స్థానంలోనైనా క్రీజులోకి వెళ్లి హిట్టింగ్ చేయగల సామర్థ్యం మాక్స్‌వెల్ సొంతం. ఈ నేపథ్యంలో అతడ్ని వేలంలో కొనుగోలు చేయాలని చెన్నై ఫ్రాంఛైజీకి ధోనీ ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2020 సీజన్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌ని పంజాబ్ సరిగా వినియోగించుకోలేదనే అపవాదు ఉంది. అతని బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో పంజాబ్ టీమ్ మేనేజ్‌మెంట్ సరిగా శ్రద్ధ పెట్టలేదని.. తక్కువ బంతులు మాత్రమే ఆడే అవకాశమిచ్చిందనే అభిప్రాయాలు వినిపించాయి. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మాక్స్‌వెల్ 167 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో ఈ హిట్టర్ స్ట్రైక్‌రేట్ 194.18గా ఉండటం గమనార్హం. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌‌ కోసం ఒకవేళ మాక్స్‌వెల్.. చెన్నై టీమ్‌లోకి వస్తే..? కెప్టెన్ ధోనీ అతడ్ని చక్కగా వినియోగించుకోగలడని ‌ఆ ఫ్రాంఛైజీ ధీమాతో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.