యాప్నగరం

IPL Playoff: ముంబైపై రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్

Mumbi Indiansపై రాజస్థాన్ రాయల్స్ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మూసుకుపోయాయి. ఐపీఎల్‌లో చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరకుండా నిష్క్రమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Samayam Telugu 26 Oct 2020, 7:20 am
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 196 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఓ దశలో 170 పరుగుల్లోపే పరిమితం అవుతుందని భావించారంతా. కానీ ఆఖర్లో హార్దిక్ పాండ్య సిక్సులతో విరుచుకపడ్డాడు. 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. దీంతో ముంబై అనూహ్యంగా 195 పరుగులు చేయగలిగింది.
Samayam Telugu Chennai Super Kings
( BCCI/IPL)


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. ఆరంభంలోనే ఉతప్ప, స్మిత్ వికెట్లను కోల్పోయింది. కానీ మరో ఓపెనర్ బెన్ స్టోక్స్ (67 బంతుల్లో 107 నాటౌట్) అజేయ శతకంతో సత్తా చాటగా.. సంజా శాంసన్ (31 బంతుల్లో 54 నాటౌట్) మరో ఎండ్‌లో సహకరించాడు. దీంతో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 18.2 ఓవర్లలోనే చేధించింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు సజీవంగా ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరేందుకు ద్వారాలు మూసుకుపోయాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందిన చెన్నై సూపర్ కింగ్స్.. రెండు పాయింట్లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాజస్థాన్, ముంబై మ్యాచ్ ముగియడానికి ముందు వరకు ధోనీ సేనకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. కానీ గణాంకాల జోలికి తాము వెళ్లదల్చుకోలేదని.. ఈ సీజన్లో తమ జట్టు ప్లేఆఫ్స్ చేరడం లేదని ధోనీ చెప్పాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో ఆడిన గత పది సీజన్లలో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలవగా.. ఐదుసార్లు ఫైనల్ చేరింది. మరో రెండు సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. కానీ ప్లేఆఫ్స్‌ చేరకుండా లీగ్ నుంచి నిష్క్రమించడం ఇదే తొలిసారి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.