యాప్నగరం

IPL: చెన్నై నిష్క్రమణ వేళ వాట్సన్ భావోద్వేగం.. క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్!

CSK ఓపెనర్ షేన్ వాట్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2020లో చెన్నై చివరి మ్యాచ్ ఆడిన తర్వాత తాను క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అవుతున్నట్లు సహచరులకు తెలిపాడు.

Samayam Telugu 3 Nov 2020, 9:40 am
ఐపీఎల్ 2020 తర్వాత కాంపిటీటివ్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ తెలిపాడు. కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌‌పై చెన్నై విజయం సాధించిన తర్వాత.. వాట్సన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను రిటైర్ అవుతున్నానని వాట్సన్ సూపర్ కింగ్స్ సహచర క్రికెటర్లకు చెప్పాడు. 2018 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వాట్సన్‌ను రూ.4 కోట్లతో కొనుగోలు చేయడానికి ముందే.. అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.
Samayam Telugu shane watson ipl
Image: IPL/BCCI


2018 ఐపీఎల్ ఫైనల్‌లో సెంచరీ చేసిన వాట్సన్.. చెన్నై సూపర్ కింగ్స్ మూడోసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో 555 రన్స్ చేసిన వార్నర్.. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై సెంచరీ బాది చెన్నైకి కప్ అందించాడు. 2019 ఫైనల్లోనూ దెబ్బ తగిలి రక్తం కారుతున్నా.. వీరోచితంగా పోరాడాడు. 59 బంతుల్లోనే 80 రన్స్ చేసిన వాట్సన్ చివరి ఓవర్లో రనౌట్ కావడంతో.. ముంబై ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది.

Image: IPL/BCCI

ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వేళ వాట్సన్ భావోద్వేగానికి లోనయ్యాడని తెలుస్తోంది. చెన్నై తరఫున ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని వాట్సన్ వ్యాఖ్యానించాడని సమాచారం.
ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వాట్సన్.. రాజస్థాన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి సీజన్లో 472 రన్స్ చేయడంతోపాటు 17 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 2016 సీజన్లో వాట్సన్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 145 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్.. 3874 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మీడియం పేసర్‌గానూ రాణించిన ఈ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ 92 వికెట్లు పడగొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.