యాప్నగరం

అతణ్ని పక్కనబెట్టడం ఆశ్చర్యపరిచింది.. SRH ఆటగాడిపై గౌతీ ప్రశంసలు

sunrisers Hyderabad ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌పై గౌతమ్ గంభీర్ ప్రశంసలు గుప్పించారు. ఆర్సీబీపై బ్యాట్‌తో, బంతితో హోల్డర్ ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు.

Samayam Telugu 9 Nov 2020, 8:28 am
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌పై గౌతమ్ గంభీర్ ప్రశంసలు గుప్పించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుపై ఆరెంజ్ ఆర్మీ విజయంలో హోల్డర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 4 ఓవర్లలో 25 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన హోల్డర్.. బ్యాటింగ్‌లో 24 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఛేజింగ్‌లో తీవ్ర ఒత్తిడిలో హోల్డర్ ఆకట్టుకునేలా బ్యాటింగ్ చేశాడు. గాయపడిన మార్ష్ స్థానంలో జట్టులోకి వచ్చిన హోల్డర్.. సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
Samayam Telugu gautam gambhir


కానీ గత ఏడాది ఐపీఎల్ వేలంలో హోల్డర్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. గతంలో తమ జట్టు సభ్యుడైన హోల్డర్‌ను గాయపడిన మిచెల్ మార్ష్‌కు రీప్లేస్‌మెంట్‌గా సన్‌రైజర్స్ తీసుకుంది. టెస్టుల్లో వెస్టిండీస్ కెప్టెన్‌గా ఉన్న హోల్డర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం పట్ల మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

జిమ్మీ నీషామ్, క్రిస్ మోరీస్, ఇతర ఆల్‌రౌండర్లను ఎంపిక చేసుకున్న ఫ్రాంచైజీలు హోల్డర్‌ను పక్కనబెట్టడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లకు ఒత్తిడిని ఎదుర్కోవడం తెలుస్తుందన్న హోల్డర్.. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఒత్తిడిని ఎదుర్కోవడం ఎంతో ముఖ్యమన్నాడు.

‘అంతర్జాతీయ జట్టుకు హోల్డర్ కెప్టెన్‌గా ఉన్నాడనే విషయం మరవొద్దు. అతడు నిరంతరం అంతర్జాతీయ క్రికెట్లో రెండు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. కొత్త బంతితో ఓవర్‌కు 6.25 చొప్పున మాత్రమే పరుగులిస్తూ కీలకమైన రెండు వికెట్లు తీశాడు. ఓవర్సీస్ ఆల్‌రౌండర్ నుంచి ఇంతకు మంచి ఏం ఆశించగం’ అని బెంగళూరుతో మ్యాచ్‌లో హోల్డర్ ప్రదర్శనను ఉద్దేశించి గంభీర్ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హోల్డర్ 14 వికెట్లు తీయడంతోపాటు 66 రన్స్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.