యాప్నగరం

లక్నోని బెంబేలెత్తించిన గుజరాత్.. పట్టికలో నెం.1 మరింత పదిలం

Gujarat Titans టీమ్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగిపోయిన గుజరాత్ టీమ్ ఏ దశలోనూ లక్నోకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 7 May 2023, 7:37 pm
ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) మరోసారి ప్రత్యర్థి జట్టుపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విరుచుకుపడింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టీమ్ 171/7కే పరిమితమైంది. దాంతో మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో గెలుపొందిన గుజరాత్ టైటాన్స్ టీమ్.. పాయింట్ల పట్టికలో నెం.1 స్థానాన్ని 16 పాయింట్లతో మరింత పదిలం చేసుకుంది. లక్నో టీమ్ (11 పాయింట్లు) ఐదో ఓటమితో మూడో స్థానానికి పరిమితమైంది.
Samayam Telugu GT vs LSG
గుజరాత్ టీమ్


228 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు క్వింటన్ డికాక్ (70: 41 బంతుల్లో 7x4, 3x6), కైల్ మేయర్స్ (48: 32 బంతుల్లో 7x4, 2x6) హిట్టింగ్ చేశారు. కానీ.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా ఫెయిలయ్యారు. దీపక్ హుడా (11), మార్కస్ స్టాయినిస్ (4), నికోలస్ పూరన్ (3), కృనాల్ పాండ్య (0) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. అయితే.. చివర్లో ఆయుష్ బదోని (21: 11 బంతుల్లో 1x4, 2x6) కాస్త దూకుడుగా ఆడటంతో కనీసం 171 పరుగులైనా లక్నో చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

మ్యాచ్‌లో అంతకముందు శుభమన్ గిల్ (94 నాటౌట్: 51 బంతుల్లో 2x4, 7x6), వృద్ధిమాన్ సాహా (81: 43 బంతుల్లో 10x4, 4x6) దూకుడుగా ఆడటంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ 2 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. హార్దిక్ పాండ్య (25: 15 బంతుల్లో 1x4, 2x6), డేవిడ్ మిల్లర్ (21 నాటౌట్: 12 బంతుల్లో 2x4, 1x6) ఫర్వాలేదనిపించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మోసిన్ ఖాన్, అవేష్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.