యాప్నగరం

IPL 2021: బీసీసీఐ ముందు కీలక ప్రతిపాదన.. అమలైతే సన్‌రైజర్స్‌కు భారీ బూస్టింగ్!

BCCI ముందున్న కీలక ప్రతిపాదన సన్‌రైజర్స్‌లో ఆశలు పెంచుతోంది. వచ్చే సీజన్లో కొత్త ఫ్రాంచైజీ బరిలో దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు బోర్డు ఓకే చెప్పే అవకాశం ఉంది.

Samayam Telugu 14 Nov 2020, 9:25 am
ఐపీఎల్ 2021లో మరో కొత్త జట్టు బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కుదిరితే పది జట్లతో ఐపీఎల్ 2021 నిర్వహించే దిశగా బీసీసీఐ కసరత్తు చేస్తోంది. అహ్మదాబాద్ వేదికగా నూతన ఫ్రాంచైజీ ఏర్పాటు చేస్తారనే వార్తలు ఇప్పటికే బయటకొచ్చాయి. త్వరలోనే బిడ్డింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా జట్లలో భారత క్రికెటర్లు పెద్దగా లేరు. ఇప్పుడు కొత్త జట్లు రేసులోకి వస్తే.. భారత ఆటగాళ్ల కొరత మరింత ఎక్కువ అవుతుంది.
Samayam Telugu Sunrisers Hyderabad


ఇండియన్ క్రికెటర్లు లేని లోటును పూడ్చం కోసం.. వచ్చే సీజన్లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు తుది జట్టులో ఉండేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఓ ఫ్రాంచైజీ 8 మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉండగా.. అందులో నలుగుర్ని మాత్రమే ఆడించి.. మరో నలుగుర్ని బెంచ్‌కే పరిమితం చేయాల్సి వస్తోంది. ఈ నిబంధనను సడలిస్తే.. ఫ్రాంచైజీలకు ఊరట కలుగుతుంది.

ముఖ్యంగా సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ లాంటి ఫ్రాంచైజీలకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. నలుగురు విదేశీ క్రికెటర్లే ఆడాలన్న నిబంధన కారణంగా.. ఐపీఎల్ 2020లో విలియమ్సన్‌ను ఆడించడం కోసం మహ్మద్ నబీ లాంటి వరల్డ్ నంబర్ 1 టీ20 ఆల్‌‌రౌండర్‌కు సన్‌రైజర్స్ ఒక్క మ్యాచ్‌లోనే ఆడించింది. ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను ఆడించడం కోసం బెయిర్‌స్టోను పక్కనబెట్టాల్సి వచ్చింది. బెయిర్‌స్టో స్థానంలో బరిలో దిగిన సాహా అద్భుతంగా ఆడాడు. కానీ గాయం కారణంగా కీలకమైన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

దీంతో సాహా స్థానంలో శ్రీవాత్స్ గోస్వామిని ఆడించగా.. అతడు రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌటై నిరాశపర్చాడు. ఐదుగురు ఆటగాళ్లను ఆడించొచ్చనే వెసులుబాటు ఉంటే సన్‌రైజర్స్ ప్లేఆఫ్‌లో బెయిర్‌స్టోని ఆడించగలిగేది. ఫ్యాబియన్ అలెన్, మహ్మద్ నబీల్లో ఒకరు రెగ్యులర్‌గా ఆడేవారు. లేదంటే భువీ గైర్హాజరీ వేళ బిల్లీ స్టాన్లేక్‌కు తుది జట్టులో చోటు దక్కి ఉండేది.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ది ఇదే పరిస్థితి. ఆ జట్టులో రాబిన్ ఉతప్ప, సంజూ శాంసన్ మాత్రమే పేరున్న భారత బ్యాట్స్‌మెన్. ఆర్చర్, స్మిత్, బట్లర్, స్టోక్స్, ఆండ్రూ టై, టామ్ కరన్ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. బీసీసీఐ విదేశీ ఆటగాళ్ల విషయంలో వెసులుబాటు కల్పిస్తే.. మిగతా ఫ్రాంచైజీలు కూడా లాభపడే అవకాశం ఉంది. వచ్చే వేలంలో విదేశీ క్రికెటర్లకు డిమాండ్ మరింత పెరుగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.