యాప్నగరం

IPL మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో... ఆటగాళ్ల బదిలీకి జట్ల విముఖత.. అసలు కారణాలివే!

ఓ జట్టు తరఫున రెండు కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లను మరో జట్టు తీసుకునే వెసులుబాటు మిడ్ సీజన్ ట్రాన్స‌్‌ఫర్ విండో కల్పిస్తోంది. కానీ ఫ్రాంచైజీలు అందుకు సుముఖంగా లేవు.

Samayam Telugu 17 Oct 2020, 12:42 pm
ఐపీఎల్ 2020 మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో నేటితో (శనివారం) ముగియనుంది. ఈ సీజన్లో క్యాప్డ్ ప్లేయర్లను సైతం బదిలీ చేసుకోవడానికి ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అవకాశం కల్పించినప్పటికీ... ఫ్రాంచైజీలేవీ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌ పట్ల సుముఖంగా లేవని అర్థం అవుతోంది. వేరే ఫ్రాంచైజీల నుంచి ఆటగాళ్లను తెచ్చుకుని.. విజయావకాశాలను పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ.. జట్లు ఆ దిశగా ప్రయత్నించలేదు.
Samayam Telugu gayle-rahane-parthiv-tahir


ఐపీఎల్ 2019 మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి మాత్రమే వీలుండేది. ఈ సీజన్లో క్యాప్డ్ ప్లేయర్ల బదిలీకి కూడా అవకాశం కల్పించినా ఫ్రాంచైజీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. దీనికి కారణాలేంటో చూద్దాం..

మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఓ జట్టు నుంచి మరో జట్టుకు మారిన ఆటగాడు.. తాను బయటకు వచ్చిన జట్టుతో జరిగే మ్యాచ్‌ల్లో ఆడేందుకు వీల్లేదు. ఉదాహరణకు.. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఇమ్రాన్ తాహిర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ తీసుకుందనుకుంటే.. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో అతడు కోల్‌కతా తరఫున ఆడకూడదు.

అంతే కాదు ఈ పద్ధతిలో ఆటగాళ్ల బదిలీ తాత్కాలికం. మళ్లీ తాహిర్ ఉదాహరణే తీసుకుంటే.. కోల్‌కతా అతణ్ని చెన్నై నుంచి తీసుకున్నప్పటికీ.. ఈ సీజన్లోని మిగతా మ్యాచ్‌ల్లో మాత్రమే అతడు కోల్‌కతా తరఫున ఆడతాడు. ఒకవేళ నైట్ రైడర్స్ ఫైనల్స్‌కు చేరింది అనుకుంటే.. లీగ్ దశలోని మ్యాచ్‌లతోపాటు.. ప్లేఆఫ్స్.. ఫైనల్లో మాత్రమే అతడు కోల్‌కతా జట్టులో సభ్యుడిగా ఉంటాడు. 2021 సీజన్ నాటికి మళ్లీ తన మాతృ జట్టయిన చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాల్సి ఉంటుంది.

సీజన్ మధ్యలో తమ జట్టు నుంచి మరో జట్టుకు వెళ్లే ఆటగాడు తమ ప్రణాళికలు, వ్యూహాలను వేరే జట్టుకు చేరవేస్తారేమోనని ఫ్రాంచైజీలు భయపడే అవకాశం ఉంది. ఒక వేళ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఆటగాణ్ని వదులుకున్న తర్వాత.. జట్టులో ఎవరైనా గాయపడితే.. అప్పుడు మళ్లీ రీప్లేస్‌మెంట్ సమస్య తలెత్తుంది. ఇలా జరిగితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గాయపడిన ఆటగాళ్ల స్థానంలో మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా కొనుగోలు చేసిన ఆటగాళ్లను ఆడించొచ్చా లేదా అనే విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లేదా బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. సన్‌రైజర్స్ విషయమే తీసుకుంటే.. గాయపడిన మిచెల్ మార్ష్, భువీ స్థానాల్లో జాసన్ హోల్డర్, యర్రా పృథ్వీరాజ్‌లను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది. వీరి స్థానంలో వేరే జట్లకు చెందిన ఆటగాళ్లను తీసుకుంటే ఆడొచ్చా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.

ఇవే నిబంధనలు కొనసాగితే గనుక.. 2021 సీజన్లోనూ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఏ జట్టు కూడా ఆటగాళ్లను బదిలీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయదు. ఆటగాళ్లను బదిలీ చేసుకోవడం అనేది తాత్కాలిక ప్రతిపాదకన కాకుండా శాశ్వతంగా ఉండేలా రూల్స్ మార్చాలి.. లేదంటే ఈ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో అనేదే అవసరం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.