యాప్నగరం

SRH vs MI: రషీద్ ఖాన్‌కి ఏమైంది..? ఆశ్చర్యపోయిన సన్‌రైజర్స్ ఫ్యాన్స్

బౌలింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ రషీద్ ఖాన్‌కి తిరుగులేదు. పవర్ ప్లే సమయంలో బౌండరీ లైన్ వద్ద మెరుపు వేగంతో క్యాచ్‌లను అందుకునే రషీద్.. తన బౌలింగ్‌లోనే అదీ సులువైన క్యాచ్‌ని జారవిడచడమా..?

Samayam Telugu 4 Nov 2020, 9:00 am
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ సులువైన క్యాచ్‌ని పేలవరీతిలో చేజార్చడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. స్పిన్నర్‌గానే కాకుండా అద్భుతమైన ఫీల్డర్‌గా పేరొందిన రషీద్ ఖాన్.. బౌండరీ లైన్ వద్ద ఎన్నోసార్లు డైవ్ క్యాచ్‌లను అందుకుని కితాబులు అందుకున్నాడు. కానీ.. షార్జాలో తన బౌలింగ్‌‌లోనే ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ని రివర్స్‌ కప్ స్టయిల్‌లో తీసుకోబోయి రషీద్ ఖాన్ నేలపాలు చేశాడు. ఆఖరికి ముంబయి టీమ్‌లో ఇషాన్ కిషన్ (33: 30 బంతుల్లో 1X4, 2X6) ఎక్కువ బంతులు ఆడిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచి విలువైన పరుగులు చేశాడు.
Samayam Telugu Rashid Khan (Photo Credit: BCCI/IPL)
Rashid Khan (Photo Credit: BCCI/IPL)



రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో భారీ సిక్స్ బాదిన ఇషాన్ కిషన్.. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో మరోసారి సిక్స్ కోసం ప్రయత్నించాడు. అయితే.. ఈసారి రషీద్ ఖాన్ బంతిని వికెట్ల ఎడంగా వేయడంతో ఇషాన్ కాస్త మోకాలిని వంచి స్వీప్ ఆడాడు. దాంతో.. బ్యాట్ టాప్ ఎడ్జ్‌ని తాకిన బంతి బౌలింగ్‌ ఎండ్‌లో గాల్లోకి లేచింది. అయితే.. క్యాచ్‌ని తీసుకోవడంలో ఆఖరి క్షణంలో తత్తరపాటుకి గురైన రషీద్ ఖాన్ దాన్ని జారవిడిచాడు. అతని చేతి నుంచి బౌన్స్ అయిన బంతి నేలపాలైంది. దాంతో.. కొన్ని క్షణాల పాటు రషీద్ కూడా ఆ మిస్ ఫీల్డింగ్‌ని నమ్మలేకపోయాడు.


పవర్ ప్లే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసే రషీద్ ఖాన్.. వేగంగా పరుగెత్తడంతో పాటు మంచి టైమింగ్‌తో క్యాచ్‌లు అందుకుంటూ ఉంటాడు. అలాంటి రషీద్ ఖాన్.. తన బౌలింగ్‌లోనే క్యాచ్‌ని జారవిడచడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌‌లో 4 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 32 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.