యాప్నగరం

RR vs CSK: రాజస్థాన్ చేతిలో చెన్నై ఓటమికి కారణాలివే.. ధోనీ అతణ్ని ఎందుకు వాడలేదు?

Rajasthan Royalsతో జరిగిన మ్యాచ్‌లో Chennai Super Kings కేవలం 125 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్‌లో ఆరంభంలోనే వికెట్లు పడగొట్టినప్పటికీ.. తర్వాత మ్యాజిక్ చేయలేకపోయారు.

Samayam Telugu 20 Oct 2020, 8:14 am
రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్లో ఏడో ఓటమిని మూటగట్టుకుంది. టాస్ గెలిచిన ధోనీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. చెన్నై వేగంగా వికెట్లను కోల్పోయింది. ఏ దశలోనూ ఆ జట్టు రన్‌రేట్ 6ను దాటలేకపోయింది. 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నైను.. జడేజా (30 బంతుల్లో 35 నాటౌట్), ధోనీ (28 బంతుల్లో 28) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించినప్పటికీ.. వేగంగా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేయగలిగింది.
Samayam Telugu dhoni vs rr | Image: IPL/BCCI
Dhoni | Image: IPL/BCCI


స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చెన్నై బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐదు ఓవర్లలోనే 3 వికెట్లు తీసి విజయంపై ఆశలు రేపారు. కానీ ఆ తర్వాత మాత్రం బట్లర్, స్మిత్ వారికి అవకాశం ఇవ్వలేదు. ఏడు ఓటములతో ధోనీ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. కానీ టెక్నికల్‌గా ఇప్పటికీ ధోనీ సేనకు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలున్నాయి. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చెన్నై చేసిన తప్పిదాలేంటో చూద్దాం..

అబుదాబీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. కానీ ధోనీ, జడేజా భాగస్వామ్యంతో కోలుకుంది. చివర్లో దూకుడుగా ఆడి ఉంటే.. 150 పరుగులైనా చేసి ఉండేది. కానీ 20 ఓవర్లు బ్యాటింగ్ చేసినా.. ఆ జట్టు 125 పరుగులకే పరిమితమైంది.

125 పరుగులను కాపాడుకునే క్రమంలో చెన్నై ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. చాహర్, హేజిల్‌వుడ్ అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. కానీ స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్‌లను ఔట్ చేయడంలో చెన్నై బౌలర్లు విఫలమయ్యారు. అప్పటి వరకూ పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన పిచ్ మీద బట్లర్ సౌకర్యవంతంగా ఆడటం ఆశ్చర్యపరిచింది. ఇద్దరు కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ కుదురుకుంటున్న వేళ.. ఎడమ చేతవాటం పేసర్ అయిన సామ్ కరన్‌తో బౌలింగ్ చేయించి ఉంటే బాగుండేది. కానీ ఈ మ్యాచ్‌లో కరన్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. లక్ష్యం తక్కువ కాబట్టి.. బౌలింగ్‌లో వేగంగా మార్పులు చేయాల్సింది. కానీ ధోనీ అలా చేయలేదు.

ధోనీ ఆడే మైండ్ గేమ్ ఎవరికీ అంతుపట్టదు. అనూహ్యమైన ఎత్తుగడలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. కానీ ఇప్పటికే చెన్నై ఆరు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ.. ధోనీ మాత్రం కొత్తగా ఏం ప్రయత్నించలేదు. గత మ్యాచ్‌ల్లో ఎలాగైతే ఆడారో.. ఈ మ్యాచ్‌లోనూ అదేలా ఆడారు. చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరినా చేరకపోయినా.. తదుపరి మ్యాచ్‌ల్లో మాత్రం విజయాలు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గెలవాలనే తపనే చెన్నై ఆటగాళ్లలో కనిపించడం లేదని.. ఓటమి కంటే ఇది ఎక్కువగా బాధిస్తోందని అభిమానులు వాపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.