యాప్నగరం

విదేశాల్లో ఐపీఎల్ 2020 నాకౌట్ మ్యాచ్‌లు..!

ఐపీఎల్‌ 2020 సీజన్ ప్లేఆఫ్ మ్యాచ్‌లు భారత్‌ వెలుపల జరగనున్నాయా..? టోర్నీకి ఆదరణ పెంచేందుకు ఫ్రాంఛైజీలు కొత్త వ్యూహాన్ని ఆలోచించాయి. కానీ.. బీసీసీఐ ఒప్పుకుంటుందా..?

Samayam Telugu 19 Feb 2020, 4:57 pm
ఐపీఎల్ 2020 సీజన్ ప్లేఆఫ్ మ్యాచ్‌లు విదేశాల్లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని టోర్నీలోని ఓ మూడు ఫ్రాంఛైజీలు అభ్యర్థించాయి. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. మే 17 వరకూ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే లీగ్ దశ షెడ్యూల్‌ని విడుదల చేసిన బీసీసీఐ.. నాకౌట్ మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే.. మే 24న ఫైనల్ జరగనున్నట్లు మాత్రం ప్రకటించింది.
Samayam Telugu ipl schedule franchises propose to ipl 2020 play off matches in us canada singapore
విదేశాల్లో ఐపీఎల్ 2020 నాకౌట్ మ్యాచ్‌లు..!


ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ ప్రకటించకపోవడానికి కారణం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీలేనట. ఇటీవల బీసీసీఐ ఉన్నాధికారుల్ని కలిసిన ఈ మూడు ఫ్రాంఛైజీలు నాకౌట్ మ్యాచ్‌ల్నిభారత్ వెలుపల నిర్వహించాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. క్రికెట్‌కి పెద్దగా ఆదరణలేని అమెరికా, కెనడా, సింగపూర్‌లో ఈ ప్లేఆఫ్ మ్యాచ్‌ల్ని నిర్వహించడం ద్వారా.. టోర్నీ ఆదరణ మరింత పెరగనుందని ఫ్రాంఛైజీలు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడిందట.

2008లో ప్రారంభమైన ఐపీఎల్.. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న టోర్నీగా విరాజిల్లుతోంది. ఈ టోర్నీకి పోటీగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్ తదితర దేశాలు ప్రైవేట్ టీ20 లీగ్స్‌ని నిర్వహించినా.. ఐపీఎల్‌ ముందు అవి తేలిపోయాయి. దీంతో.. ఐపీఎల్‌ని ఎక్కడ నిర్వహించినా.. ఆదరణ ఏమాత్రం తగ్గదని బీసీసీఐ ముందు స్పష్టం చేసిన ఫ్రాంఛైజీలు.. క్రికెట్‌కి ఆదరణలేని దేశాల్లో నిర్వహించడం ద్వారా.. అక్కడి ప్రేక్షకుల్ని కూడా ఈ టోర్నీకి దగ్గర చేయాలని భావిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.