యాప్నగరం

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. స్పిన్ దిగ్గజం గురించి ఆసక్తికర విశేషాలు..

Muttiah Muralitharan | టెస్టుల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ మురళీధరన్. అతడి జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతోంది.

Samayam Telugu 8 Oct 2020, 3:14 pm
శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్ర పోషించనున్నాడు. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎంఎస్ శ్రీపతి ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరించనుండగా.. ట్రైన్ మూవీ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ నిర్మించనున్నాయి. క్రికెట్ చరిత్రలోనే గొప్ప బౌలర్‌గా పేరొందిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ టైటిల్‌ను ‘800’గా ఖరారు చేశారని సమాచారం. టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్ మురళీధరన్ మాత్రమే.
Samayam Telugu muthaiah muraildaran


తమిళ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా పేరొందిన విజయ్ సేతుపతి.. ఈ సినిమాలో నటించడం కోసం ముత్తయ్య మురళీధరన్ దగ్గర బౌలింగ్ పాఠాలు నేర్చుకున్నాడని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. త్వరలోనే ‘ముత్తయ్య మురళీధరన్‌’కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
మురళీధరన్ భారత మూలాలు
మురళీధరన్ 1972, ఏప్రిల్ 17న శ్రీలంకలోని క్యాండీలో తమిళ హిందూ కుటుంబంలో.. సిన్నసామి ముత్తయ్య, లక్ష్మీ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి బిస్కెట్లు తయారు చేసేవారు. టీ తోటల్లో పని చేయడం కోసం 1920ల్లో మురళీధరన్ తాత పెరియసామి సిన్నసామి ఇండియా నుంచి పొరుగు దేశానికి వలస వెళ్లారు.
తర్వాత పెరియసామి.. తన కుమార్తెలతోపాటు స్వదేశానికి తిరిగొచ్చి తమిళనాడులోని తిరుచిరాపల్లిలో స్థిరపడ్డారు. కానీ మురళీధరన్ తండ్రితోపాటు పెరియసామి కొడుకులు మాత్రమే శ్రీలంకలోనే ఉండిపోయారు.

భార్యది చెన్నై..
మురళీధరన్ 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్కూల్లో మీడియం పేసర్‌గా క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. కానీ 14 ఏళ్ల వయసులో కోచ్ సునీల్ ఫెర్నాండో సూచన మేరకు ఆఫ్ స్పిన్నర్‌గా మారాడు. శ్రీలంక క్రికెట్ జట్టులో కీలకంగా మారిన మురళీధరన్.. 2005లో చెన్నైకి చెందిన మధిమలార్‌ను తమిళ సంప్రదాయం ప్రకారం.. చెన్నైలో పెళ్లాడాడు.
ఐపీఎల్‌లో..
ఐపీఎల్‌లో తొలి మూడు సీజన్లు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మురళీధరన్‌‌ను 2011లో కొచ్చి టస్కర్స్ కొనుగోలు చేసింది. 2012 నుంచి 2014 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ముత్తయ్య.. తర్వాత ఐపీఎల్ నుంచి రిటైరయ్యాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.

సచిన్.. ధోనీ.. మురళీధరన్
ఇప్పటికే సచిన్, ఎంఎస్ ధోనీ బయోపిక్‌లు ప్రేక్షకులను అలరించాయి. ధోనీ బయోపిక్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. మహేంద్ర సింగ్ ధోనీ పాత్రలో జీవించాడు. ధోనీ, సచిన్ బయోపిక్‌లతో పోలిస్తే.. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నాటకీయతకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. భారతీయ మూలాలతో శ్రీలంకలో పెరిగి పెద్దవాడై.. శ్రీలంక క్రికెట్లోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగిన ముత్తయ్య మురళీధరన్ గ్రౌండ్లోనే కాకుండా సిల్వర్ స్క్రీన్ మీద కూడా సత్తా చాటే అవకాశాలే ఎక్కువ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.