యాప్నగరం

RCB vs MI: సూపర్ ఓవర్ బౌలర్ నవదీప్ సైనీ సక్సెస్ స్టోరీ.. గంభీర్ వల్లే ఈస్థాయికి!

Gautam Gambhir వల్లే తాను ఈ రోజు ఈస్థాయిలో ఉన్నానని నవదీప్ సైనీ ఎప్పుడూ చెప్పుకుంటాడు. ఎందుకంటే గంభీర్ పోరాటం వల్లే సైనీకి ఢిల్లీ రంజీ జట్టులో చోటు దక్కింది.

Samayam Telugu 29 Sep 2020, 1:21 pm
బెంగళూరు, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అసలైన ఐపీఎల్ మజాను పంచింది. 202 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో తడబడిన ముంబై.. ఇషాన్ కిషన్, పోలార్డ్ అద్భుత బ్యాటింగ్‌తో తిరిగి రేసులోకి వచ్చింది. ఆఖరి ఐదు ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మెన్ 89 రన్స్ బాదడంతో.. ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. కెప్టెన్ కోహ్లి బంతిని నవదీప్ సైనీకి ఇచ్చాడు.
Samayam Telugu Saini | Image BCCI


ముంబై తరఫున హార్దిక్ పాండ్య, పోలార్డ్ లాంటి హిట్టర్లు బరిలో దిగినప్పటికీ.. సైనీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో 1,1,0,4,W,1B చొప్పున మాత్రమే సైనీ రన్స్ ఇచ్చాడు. దీంతో సూపర్ ఓవర్లో ఏడు రన్స్ మాత్రమే వచ్చాయి. సూపర్ ఓవర్లో సైనీ అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ.. కెప్టెన్ కోహ్లి అతడిపై ప్రశంసలు గుప్పించాడు.

బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన సైనీ ప్రతిభను గుర్తించి, సాయం చేసింది మాత్రం టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. టెన్నిస్ బాల్ టోర్నమెంట్‌లు ఆడుతూ... ఒక్కో మ్యాచ్‌కు రూ.200 చొప్పున ప్యాకెట్ మనీ సంపాదిస్తున్న సైనీ.. గంభీర్ కంటపడ్డాడు. అతడి బౌలింగ్ ప్రదర్శనను గమనించి.. టెన్నిస్ బాల్ బదులు లెదర్ బాల్‌తో ప్రాక్టీస్ చేయాలని సూచించాడు. ఢిల్లీ రంజీ జట్టులోకి సైనీని తీసుకోవడానికి గంభీర్ పెద్ద పోరాటమే చేశాడు.

హర్యానా నుంచి వచ్చిన సైనీని ఢిల్లీ జట్టులోకి ఎలా ఎంపిక చేస్తారంటూ బిషన్ సింగ్ బేడీ, చేతన్ చౌహాన్‌ అడ్డు తగిలారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కి చెందిన కొందరు కూడా వీరికి సహకరించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ.. గంభీర్ ప్రోద్బలంతో సైనీ 2013లో ఢిల్లీ రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. దీన్ని నిరసిస్తూ.. నాటి ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అరుణ్ జైట్లీకి బేడీ లేఖ రాశాడు. సైనీ ఎంపికను తప్పుబడుతూ కరపత్రాలను సైతం పంచిపెట్టారు.
View this post on Instagram A post shared by Navdeep Saini (@navdeep_saini10_official) on Jul 23, 2014 at 12:54am PDT
కానీ గంభీర్ ప్రోత్సాహంతో రాణించిన సైనీ.. 2018లో అప్ఘాన్‌తో టెస్టు మ్యాచ్‌కు తొలిసారిగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో గంభీర్ స్పందిస్తూ.. సైనీని ఢిల్లీ జట్టులోకి తీసుకోవడాన్ని తప్పుబట్టిన వారిపై సెటైర్లు వేశాడు. తను విజయం సాధించిన ప్రతిసారి.. గంభీర్‌కు సైనీ థ్యాంక్స్ చెప్పుకుంటుంటాడు. తను జీవితాంతం గంభీర్ భాయ్‌కు రుణపడి ఉంటానంటూ అతడు ఎన్నోసార్లు భావోద్వేగానికి లోనయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.