యాప్నగరం

ఆ ప్రశ్న నా జీవితాన్ని మార్చేసింది.. సంజూ శాంసన్ భావోద్వేగం

IPL 2020లో అదరగొడుతున్న సంజూ శాంసన్ తన విజయ రహస్యమేంటో చెప్పాడు. తనలో మొదలైన అంతర్మథనమే ఈ మార్పునకు కారణమని స్పష్టం చేశాడు.

Samayam Telugu 28 Sep 2020, 9:36 am
ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 32 బంతుల్లో 72 రన్స్ (1x4, 9x6) బాదిన శాంసన్.. రాజస్థాన్ 216 రన్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో మ్యాచ్‌లోనూ శాంసన్ అదరగొట్టాడు. 224 పరుగుల రికార్డ్ స్థాయి లక్ష్య చేధనలో ఏ మాత్రం బెదరకుండా.. స్మిత్‌తో కలిసి ఎదురు దాడికి దిగాడు. 4 ఫోర్లు, 7 సిక్సులు బాదిన శాంసన్.. 42 బంతుల్లోనే 85 రన్స్ చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసి.. రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన శాంసన్.. రెండుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Samayam Telugu sanju samson | Image: BCCI


పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న అనంతరం సంజూ తన సక్సెస్ సీక్రెట్‌ను బయటపెట్టాడు. ‘‘గత ఏడాది కాలంగా బాగా ఆడుతున్నాను. నా ఆటతీరులో స్పష్టమైన మార్పు గమనించాను. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ మంచి స్కోర్లు సాధించాను. దీంతో కొన్ని మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడాలనుకున్నాను. గత ఏడాది ఎంత ప్రయత్నించినా.. బాగా ఆడలేకపోయాను. దీంతో నాలో అంతర్మథనం మొదలైంది. ‘జీవితంలో ఏం సాధించాలి..? కెరీర్ ముగిసేలోగా నేను ఎక్కడ ఉండాలి? అని ప్రశ్నించుకున్నాను.

అంతర్మథనం తర్వాత.. మరో పదేళ్లపాటు క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాను. అందుకే క్రికెట్ కోసమే పూర్తి సమయం కేటాయించాలని భావించాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ నాకు బాసటగా నిలిచారు. నా శక్తిసామర్థ్యాలన్నీ ఆటపైనే కేంద్రీకరించాను. ఫలితాలు వాటంతట అవే వచ్చాయి.

బలంగా బాదడం అనేది నా జీన్స్‌లోనే ఉండొచ్చు.. మా నాన్న చాలా ఫవర్‌ఫుల్ మ్యాన్. బాగా ఆడాలంటే ఫిట్‌గా ఉండాలి.. అందుకే ఫిట్‌నెస్ విషయమై శ్రద్ధ పెట్టాను. భారీ షాట్లు ఆడటం కోసం కండలు పెంచేలా కసరత్తులు చేశాను’’ అని సంజూ శాంసన్ తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.