యాప్నగరం

సిగ్గుచేటు.. ఫైనల్ చేరలేకపోయాం.. ఓటమి అనంతరం విలియమ్సన్ భావోద్వేగం

IPL 2020 Qualifier 2 మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో సన్‌రైజర్స్ ఓడిన తర్వాత విలియమ్సన్ మాట్లాడుతూ.. ఫైనల్ చేరలేకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించాడు.

Samayam Telugu 9 Nov 2020, 11:38 am
ఐపీఎల్ ఫైనల్‌కు చేరలేకపోవడం సిగ్గుగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్లో ఆరంభంలో తడబడినప్పటికీ.. తర్వాత తమ జట్టు అద్భుతంగా పుంజుకున్నందుకు గర్వంగా ఉందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ (67 పరుగులు) పోరాడినప్పటికీ.. కీలక సమయంలో ఔటవడంతో సన్‌రైజర్స్ ఓటమి ఖాయమైంది. చివరి ఏడు మ్యాచ్‌ల్లో రెండో విజయం సాధించిన ఢిల్లీ.. సన్‌రైజర్స్ వరుస విజయాలకు బ్రేకులేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Samayam Telugu Kane williamson
Image: IPL


‘‘ఢిల్లీ చాలా మంచి జట్టు. కొంత కాలం క్రితం మేం ఎలా లయ దొరకబుచ్చుకున్నామో.. ఢిల్లీ ఆటగాళ్లు కూడా అలాగే ప్రయత్నిస్తున్నారు. మాపై ఢిల్లీ బాగా ఆడింది’’ అని మ్యాచ్ అనంతరం కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించాడు.

‘ఛేజింగ్‌కు దిగినప్పుడు రిస్క్ తీసుకోవాలి. మాకు శుభారంభం దక్కలేదు.. కానీ మధ్యలో భాగస్వామ్యాలు నెలకొల్పగలిగాం. మాకు కొద్దిగా విజయావకాశాలు ఉన్నాయి. ఫైనల్ చేరలేకపోయినందుకు సిగ్గుచేటుగా ఉంది. గత మూడు వారాలుగా మా కుర్రాళ్లు గర్వించేలా ఆడారు’ అని విలియమ్సన్ తెలిపాడు.

ఈ సీజన్లో చాలా మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయానికి చేరువగా వచ్చి ఓడిందన్న విలియమ్సన్.. మేం అత్యుత్తమ ఆటతీరు కనబర్చలేకపోయామన్నాడు. ఐపీఎల్‌‌లో ప్రతి జట్టు బలమైందే. ఎవరు ఎవర్నైనా ఓడించొచ్చు. అలాంటప్పుడు బాగా ఆడాలని విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. ప్రియమ్ గార్గ్ నెట్స్‌లో చక్కటి షాట్లు ఆడుతున్నాడని.. భవిష్యత్తులో అతడు తప్పకుండా అద్భుతమైన ఆటగాడవుతాడని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.