యాప్నగరం

వరల్డ్‌కప్‌లో ఆ తప్పునకి బాధ్యత వహిస్తున్నా.. విలన్‌ని చేశారు: యువీ

2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్‌ని భారత్ జట్టు గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్.. టీమిండియాలో చోటు కోసం 2017 నుంచి రెండేళ్లపాటు నిరీక్షించి ఆఖరిగా వీడ్కోలు మ్యాచ్‌ ఆడకుండానే గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు.

Samayam Telugu 13 May 2020, 12:22 pm
భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్ ప్రయాణం సాఫీగా సాగలేదు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన యువరాజ్ సింగ్.. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఒంటిచేత్తో భారత్‌కి కప్‌ అందించి హీరోగా మారిపోయాడు. కానీ.. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే అతను భారత క్రికెట్‌‌లో పెద్ద విలన్‌గా అభిమానులకి కనిపించాడు. 2014లో శ్రీలంకతో ఢాకా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమికి యువరాజ్ సింగ్ కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తగా.. అక్కడి నుంచి అతని కెరీర్ గాడి తప్పింది.
Samayam Telugu Yuvraj Singh


Read More: రోహిత్ శర్మకి రైనా ఫిర్యాదు.. నా చేతుల్లో ఏమీ లేదన్న హిట్‌మ్యాన్

15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మాయని మచ్చగా నిలిచిన ఆ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ గురించి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో యువరాజ్ సింగ్ మాట్లాడాడు. ఆ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన యువరాజ్ సింగ్ (11: 21 బంతుల్లో) నెమ్మది బ్యాటింగ్‌తో నిరాశపరచగా.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 130 పరుగులే చేయగలిగింది. అనంతరం లక్ష్యాన్ని శ్రీలంక 17.5 ఓవర్లలోనే 134/4తో ఛేదించేసింది. అయితే.. యువరాజ్ సింగ్ ఆ మ్యాచ్‌లో కాస్త వేగంగా ఆడింటే..? భారత్‌ మెరుగైన స్కోరు చేయగలిగి ఉండేదని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొందరైతే భారత్‌‌కి ఆ టీ20 వరల్డ్‌కప్ చేజారడానికి కారణం యువరాజ్ సింగ్ పేలవ బ్యాటింగే అని తేల్చేశారు.

Read More: హార్దిక్ పాండ్యాని రాత్రి 10 గంటలకి మందు కోసం తీసుకెళ్తా: యువరాజ్

‘‘ఆ ఫైనల్లో భారత్ ఓటమికి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఆ మ్యాచ్‌లో నేను బంతిని సరిగా హిట్ చేయలేకపోయాను. మరోవైపు శ్రీలంక బౌలర్లు కూడా మెరుగ్గా బౌలింగ్ చేశారు. దాంతో ఆ మ్యాచ్‌లో నేను కాదు.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు కూడా ఇబ్బందిపడ్డారు. కానీ.. అభిమానులు, మీడియా మాత్రం నన్ను విలన్‌గా మార్చేశారు. ఆ ఫైనల్లో టీమిండియా ఓటమి రోజున చండీగఢ్‌లోని నా ఇంటిపై కొంత మంది రాళ్లు విసిరారు. నేను ఇంటికి వెళ్లగానే అక్కడ ఇండియా క్యాప్, 2007 టీ20 వరల్డ్‌కప్‌‌లో ఆరు సిక్సర్లు కొట్టిన బ్యాట్ కనిపించింది. అప్పుడే నాకు అర్థమైంది.. నా టైమ్ అయిపోయింది’’ అని యువరాజ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.