యాప్నగరం

మూడో టెస్టులో ‘ఆధిపత్యం’ చెరో సగం..!

ఓపెనర్లు ధావన్, కేఎల్ రాహుల్ తొలి సెషన్ నుంచే లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఒకానొక సమయంలో ఓవర్‌కి ఆరుకిపైగా

TNN 12 Aug 2017, 5:52 pm
శ్రీలంకతో పల్లెకలె వేదికగా శనివారం ఆరంభమైన మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ చివరి సెషన్‌లో తడబడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (119: 123 బంతుల్లో 17x4), లోకేశ్ రాహుల్ (85: 135 బంతుల్లో 8x4) జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చినా.. మిడిలార్డర్ తడబడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 329/6తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో సాహా (13 నాటౌట్: 38 బంతుల్లో), హార్దిక్ పాండ్య (1 నాటౌట్: 6 బంతుల్లో) ఉన్నారు. తొలి రెండు టెస్టుల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటిరోజే ఆధిపత్యం ప్రదర్శించి లంకేయుల్ని బెదరగొట్టింది. కానీ.. ఈ టెస్టులో మాత్రం తొలి రోజే ఆరు వికెట్లు చేజార్చుకుని ఒత్తిడిలో పడింది.
Samayam Telugu 3rd test sri lanka fightback after dhawan century on day 1
మూడో టెస్టులో ‘ఆధిపత్యం’ చెరో సగం..!


టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు ధావన్, కేఎల్ రాహుల్ తొలి సెషన్ నుంచే లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఒకానొక సమయంలో ఓవర్‌కి ఆరుకిపైగా పరుగులను భారత్ రాబట్టింది. ఈ క్రమంలోనే అర్ధశతకాలు పూర్తి చేసుకున్న ఈ జోడి శతకాల వైపు దూసుకెళ్తుండగా.. మధ్యలో పుష్పకుమార్ ఈ జోరుకి బ్రేక్‌లేశాడు. జట్టు స్కోరు 188 వద్ద లాంగాన్‌లో ఫీల్డర్ తలమీదుగా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించిన రాహుల్ ఫీల్డర్ చండిమాల్ చేతికి చిక్కాడు. అయితే.. కొద్దిసేపటికే మరో ఓపెనర్ ధావన్ 106 బంతుల్లో కెరీర్‌లో ఆరో శతకాన్ని పూర్తిచేసుకుని భారత అభిమానుల్ని అలరించాడు.

రాహుల్ ఔట్ అనంతరం వచ్చిన పుజారా (8: 33 బంతుల్లో), ధావన్ కేవలం పది పరుగుల వ్యవధిలోనే ఔటవగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (42: 84 బంతుల్లో 3x4) కాసేపు వికెట్లు పతనాన్ని అడ్డుకుని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యలో రహానె (17) బంతి కోసం క్రీజు వెలుపలకి వచ్చి క్లీన్ బౌల్డయినా.. కెప్టెన్‌కి అశ్విన్ (31: 75 బంతుల్లో 1x4) చక్కటి సహకారం అందించాడు. చివరి సెషన్‌లో వీరిద్దరినీ ఔట్ చేసిన శ్రీలంక బౌలర్లు భారత్‌ని ఒత్తిడిలోకి నెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.