యాప్నగరం

ఆస్ట్రేలియా గడ్డపై సచిన్, లారా రికార్డ్స్‌కి విరాట్ కోహ్లీ ఎసరు..?

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఇప్పటికే నెం.2లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. గురువారం ప్రారంభంకానున్న అడిలైడ్ టెస్టులో ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితే..? రెండు రికార్డ్‌లు బద్దలుకానున్నాయి.

Samayam Telugu 16 Dec 2020, 11:25 am
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు అరుదైన రికార్డ్‌‌లకి చేరువలో ఉన్నాడు. అడిలైడ్ వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఆడనున్న కోహ్లీకి.. ఆ స్టేడియంలో మెరుగైన రికార్డ్‌లు ఉన్నాయి. ఎంతలా అంటే..? అడిలైడ్‌ స్టేడియంలో ఇప్పటికే మూడు టెస్టు సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ 71.83 సగటుతో ఏకంగా 431 పరుగులు చేశాడు. అయితే.. ఆ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో మాత్రం వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా 610 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. దాంతో.. కోహ్లీ తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 179 పరుగులు చేస్తే..? లారాని వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. అడిలైడ్‌లో 4 మ్యాచ్‌లాడిన లారా 76.25 సగటుతో పరుగులు చేయగా.. అందులో రెండు సెంచరీలు మాత్రమే ఉన్నాయి.
Samayam Telugu Virat Kohli (Image Credit: Reuters)


అడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే..? దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కంగారూల గడ్డపై నెలకొల్పిన అరుదైన రికార్డ్ ఒకటి బద్దలుకానుంది. ఆస్ట్రేలియాలో 20 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 53.2 సగటుతో 1,809 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు 12 టెస్టులాడిన విరాట్ కోహ్లీ 55.39 సగటుతో 1,274 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు శతకాలు నమోదు చేసి సచిన్ సరసన రికార్డ్‌ల్లో ఉన్న కోహ్లీ.. అడిలైడ్ టెస్టులో శతకం సాధిస్తే..? ఏడు సెంచరీలతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోనున్నాడు.

భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం ఉదయం 9.30 గంటల నుంచి అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే పితృత్వ సెలవులు తీసుకుని భారత్‌కి కోహ్లీ వచ్చేయనుండగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఏ ఫార్మాట్‌లోనూ కోహ్లీ సెంచరీ నమోదు చేయని విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.