యాప్నగరం

IND vs AUS: ధోనీ 8 ఏళ్ల రికార్డ్‌ని బద్దలుకొట్టిన రవీంద్ర జడేజా

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన రవీంద్ర జడేజా.. టీమిండియాకి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. స్లాగ్ ఓవర్లలో గాయాన్ని సైతం లెక్కచేయకుండా అతను హిట్టింగ్ చేసిన విధానం అందర్నీ ఆకట్టుకుంది.

Samayam Telugu 4 Dec 2020, 6:36 pm
టీమిండియాలో ఫినిషర్‌గా మహేంద్రసింగ్ ధోనీ లేని లోటుని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పూడ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన మూడో వన్డేలో హార్దిక్ పాండ్యాతో కలిసి ఆరో వికెట్‌కి అజేయంగా 150 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన రవీంద్ర జడేజా.. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ ఆఖరి వరకూ క్రీజులో నిలిచి టీమిండియాకి మెరుగైన స్కోరుని అందించాడు. ఒకానొక దశలో టాప్ ఆర్డర్ వికెట్లు చేజార్చుకుని 114/6తో నిలిచిన భారత్ జట్టు.. రవీంద్ర జడేజా (44 నాటౌట్: 23 బంతుల్లో 5x4, 1x6) సమయోచిత హిట్టింగ్ కారణంగానే 161 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆఖరికి 11 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
Samayam Telugu Jadeja, MS Dhoni (Image Credits: Twitter)


ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లి 44 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 8 ఏళ్ల క్రితం నెలకొల్పిన అరుదైన రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. 2012లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన ధోనీ.. 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో నెం.7లో ఆడి అత్యధికంగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శుక్రవారం వరకూ ధోనీనే నెం.1 స్థానంలో ఉండగా.. ఆ రికార్డ్‌ని తాజాగా జడేజా 44 పరుగులతో కనుమరుగు చేశాడు.

భారత వన్డే, టీ20, టెస్టుల్లో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయిన రవీంద్ర జడేజా.. బౌలింగ్‌లో కొన్నిసార్లు విఫలమైనా.. బ్యాటింగ్‌లో మాత్రం గత ఏడాదికాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా భాగస్వామ్యల్ని నిర్మించడంతో పాటు స్లాగ్ ఓవర్లలో హిట్టింగ్ చేయగల సామర్థ్యం జడ్జూకి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.