యాప్నగరం

AUS vs IND: మరో ఓపెనర్ ఎవరు..? డేవిడ్ వార్నర్ తెలివైన సమాధానం

India vs Australia Test Seriesలో వార్నర్‌‌తోపాటు ఓపెనర్‌గా ఎవరు ఆడితే బాగుంటుందో అతణ్నే అడుగుతామని సెలెక్టర్లు ప్రకటించగా.. డేవిడ్ వార్నర్ తెలివిగా సమాధానం ఇచ్చాడు.

Samayam Telugu 23 Nov 2020, 8:55 am
భారత్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో డేవిడ్ వార్నర్‌కు జోడీగా ఎవర్ని ఓపెనర్‌గా బరిలో దింపాలనే విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా మల్లగుల్లాలు పడుతోంది. వార్నర్‌‌తోపాటు గత కొన్నేళ్లుగా జో బర్న్స్ ఓపెనింగ్ చేస్తున్నాడు. కాగా ఇటీవల జరిగిన దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించిన యువ సంచలనం విల్ పుకోవ్‌స్కీ సైతం ఓపెనర్ రేసులోకి వచ్చాడు. దీంతో వార్నర్‌తోపాటు వీరిద్దరిలో ఎవరు ఓపెనర్‌గా ఆడితే బాగుంటుందో తేల్చుకోలేకపోతున్నారు. వీరిలో ఎవరు ఓపెనర్‌గా ఆడితే తనకు బాగుంటుందనే విషయమై వార్నర్‌ను అడుగుతామని ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ ట్రెవర్ హాన్స్ ఇదివరకే ప్రకటించారు.
Samayam Telugu David warner
Image: TOI


ఈ విషయమై డేవిడ్ వార్నర్ ఆచుతూచి స్పందించాడు. గతంలో తాను, క్రిస్ రోజర్స్ కలిసి ఓపెనర్లుగా ఆడామని.. ఆ తర్వాత జో బర్న్స్‌, తాను కలిసి ఓపెనింగ్ చేస్తున్నామని వార్నర్ తెలిపాడు. 2013-15 మధ్య రోజర్స్, వార్నర్ జోడి 41 ఇన్నింగ్స్‌ల్లో 51.32 యావరేజ్‌తో ఆస్ట్రేలియాకు శుభారంభాలు ఇచ్చారు. వీరిద్దరూ 9 శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. 2015లో రోజర్స్ రిటైరయ్యాక వార్నర్‌కు ఓపెనింగ్ జోడీగా జో బర్న్స్ ఆడుతున్నాడు. వీరిద్దరూ 27 ఇన్నింగ్స్‌ల్లో 50.55 సగటుతో పరుగులు చేశారు. అందులో ఆరు శతక భాగస్వామ్యాలు ఉన్నాయి.

‘‘కనీసం 12 మంది ఆటగాళ్లు నాతోపాటు ఓపెనింగ్ భాగస్వామిగా బరిలో దిగారు. కానీ చాలా మంది నిలకడగా ఆడలేకపోయారు. ఓపెనింగ్ జోడీగా ఎవరైతే నాకు సౌకర్యవంతంగా ఉంటుందోనని సెలక్టర్లు అడుగుతున్నారు. జో నాకు చాలా కాలంగా తెలుసు. ఒకరి ఆట గురించి మరొకరికి బాగా తెలుసు. జోతో కలిసి కొన్నేళ్లుగా బాగా ఆడుతున్నాను. కానీ ఆ పొజిషన్లో సరైన వ్యక్తిని తీసుకోవడం అనేది సెలెక్టర్ల ఇష్టం. వాళ్లు విల్ వైపు మొగ్గినా ఫర్వాలేదు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు జట్టులో చేరే అవకాశం ఉంది. కానీ ఓ ఆటగాడు జట్టులోకి రావడం కంటే.. బయటకు వెళ్లడం కష్టం. సెలక్టర్లు ఎవర్నీ ఆడించినా.. మరో ఓపెనర్‌గా బరిలో దిగిన వ్యక్తి తన పని తాను చేసినంత వరకు నాకు సమ్మతమే, ఆనందమే.

జో బర్న్స్ గత వేసవి సీజన్లో తప్పులు చేశాడని నేను అనుకోవడం లేదు. మేం కొన్ని మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. 60కిపైగా సగటుతో పరుగులు జోడించాం. ఓపెనింగ్ జోడి నుంచి ఎవరైనా అదే ఆశిస్తారు. జట్టు ఎంపిక అనేది సెలక్టర్ల ఇష్టం. ఎవరు ఆడినా నాకు ఇష్టమే’’నని వార్నర్ తెలిపాడు.

‘‘జో, నేను మైదానం వెలుపల కూడా మంచి స్నేహితులం. బరిలో దిగినప్పుడు అతడు నాకు మద్దతుగా ఉంటాడు. మేమిద్దరం గత ఏడాది చాలా మ్యాచ్‌ల్లో బాగా ఆడాం. దాన్ని విడదీయాల్సిన అవసరం లేదు. పరిస్థితులు బాగోలేనప్పుడు కచ్చితంగా సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలి. విల్, జో.. ఎవరు బరిలో దిగినా.. పరుగులు చేయాల్సిందే’’నని వార్నర్ తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.