యాప్నగరం

బౌలర్లూ జాగ్రత్త.. వార్నర్ వచ్చేస్తున్నాడు

ఆసీస్ పరుగులు యంత్రం డేవిడ్ వార్నర్ భారత పర్యటనకు అద్భుతంగా సన్నద్ధం అవుతున్నాడు. బంగ్లాదేశ్‌పై వరుసగా రెండో టెస్టులోనూ..

TNN 6 Sep 2017, 2:57 pm
ఆస్ట్రేలియా పరుగుల యంత్రం డేవిడ్ వార్నర్ భారత పర్యటన కోసం తనదైన రీతి శైలిలో సన్నద్ధం అవుతున్నాడు. బంగ్లాదేశ్ గడ్డ మీద జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వరుసగా రెండో శతకం బాదిన వార్నర్.. ఉపఖండంలో సత్తా చాటుతున్నాడు. మిర్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఓడినప్పటికీ.. వార్నర్ సెంచరీతో జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. చిట్టగాంగ్‌లో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆసీస్ తక్కువ స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరోసారి శతకం బాదిన డేవిడ్ వార్నర్ జట్టును ఆదుకున్నాడు. ఇది టెస్టుల్లో వార్నర్‌కు 20వ సెంచరీ కావడం విశేషం. బంగ్లా పర్యటనకు ముందు వార్నర్ టెస్టుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ బంగ్లాపై వరుసగా రెండు శతకాలు బాదడం ద్వారా విమర్శకుల నోళ్లు మూయించాడు.
Samayam Telugu david warner prepares for tour of india with two back to back centuries vs bangladesh
బౌలర్లూ జాగ్రత్త.. వార్నర్ వచ్చేస్తున్నాడు


గతేడాది భారత్, శ్రీలంకలపై వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. భారత్‌పై అతడు కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. కానీ ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో వార్నర్ సత్తా చాటాడు. తొలి రోజు మొదటి సెషన్లోనే సెంచరీ సాధించాడు. తొలి సెషన్లోనే సెంచరీ బాదిన ఐదో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.


మిర్పూర్ వేదికగా బంగ్లాతో జరిగిన టెస్టులో వార్నర్ అద్భుతంగా రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ ద్వారా ఆసీస్‌ను గెలిపించేందుకు శతథా ప్రయత్నించాడు. కానీ ఆ టెస్టులో 20 పరుగుల తేడాతో కంగారూలు ఓడారు. స్మిత్‌తో కలిసి రెండు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పిన వార్నర్ (123 పరుగులు) చిట్టగాంగ్ టెస్టులో ఆసీస్‌ను భారీ స్కోరు దిశగా నడిపాడు. రెండు వరుస సెంచరీలతో భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కోసం తాను ఎలా సన్నద్ధం అవుతున్నాడో వార్నర్ చెప్పకనే చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడటం వల్ల భారత్‌లోని పిచ్‌లు ఎలా స్పందిస్తాయనే విషయంపై వార్నర్‌కు పూర్తి అవగాహన ఉంది. సో బౌలర్లూ బీకేర్‌ఫుల్ వార్నర్ వచ్చేస్తున్నాడు.

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 305 పరుగులు చేయగా, ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ ఏడు వికెట్లు తీశాడు. తొలి టెస్టులో ఓడటంతో రెండో టెస్టులో ఎలాగైనా నెగ్గాలనే కసి మీదున్న స్మిత్ సేన 92 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.