యాప్నగరం

రెండో టీ20లో శతక్కొట్టిన దీపక్ హుడా.. ఐర్లాండ్ టార్గెట్ 226

Deepak Hooda Centuryతో రెండో టీ20లో భారత్ జట్టు భారీ స్కోరుని నమోదు చేసింది. అతనితో పాటు సంజు శాంసన్ కూడా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడేశాడు. కానీ.. చివర్లో ఇద్దరు బ్యాటర్లు..?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 29 Jun 2022, 12:13 am

ప్రధానాంశాలు:

  • ఐర్లాండ్‌పై రెండో టీ20లో దీపక్ హుడా శతకం
  • మెరుపు హాఫ్ సెంచరీ బాదిన సంజు శాంసన్
  • చివర్లో దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ డకౌట్
  • హుడా- సంజు రికార్డ్ భాగస్వామ్యం నమోదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Deepak Hooda Century (Pic Credit: BCCI)
ఐర్లాండ్‌తో మంగళవారం రాత్రి జరుగుతున్న రెండో టీ20లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్ దీపక్ హుడా శతకంతో చెలరేగాడు. కేవలం 57 బంతుల్లో 9x4, 6x6 సాయంతో దీపక్ హుడా 104 పరుగులు చేయడంతో మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడాతో పాటు ఓపెనర్ సంజు శాంసన్ (77: 42 బంతుల్లో 9x4, 4x6) కూడా దూకుడుగా ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున ఇప్పటి వరకూ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా మాత్రమే సెంచరీలు నమోదు చేయగా.. తాజాగా ఈ ముగ్గురి సరసన దీపక్ హుడా కూడా చేరాడు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. సంజు శాంసన్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఇషాన్ కిషన్ (3) మూడో ఓవర్‌లోనే పేలవంగా మార్క్ అడైర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే.. నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన దీపక్ హుడా.. ఫస్ట్ నుంచే టాప్‌గేర్‌లో ఆడేశాడు. పవర్‌ప్లేలో అతను స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న సంజు శాంసన్ కూడా గేర్ మార్చడంతో ఐర్లాండ్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. సంజు శాంసన్- దీపక్ హుడా జోడి రెండో వికెట్‌కి 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.

టీ20 కెరీర్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంజు శాంసన్.. టీమ్ స్కోరు 189 వద్ద మార్క్ అడైర్ విసిరిన యార్కర్‌కి క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే శతకాన్ని నమోదు చేసిన దీపక్ హుడా.. జాషువా లిటిల్ బౌలింగ్‌లో ఔటైపోయాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే కళ్లుచెదిరే సిక్స్ బాదిన సూర్యకుమార్ యాదవ్ (15: 5 బంతుల్లో 2x4, 1x6) కూడా నిమిషాల వ్యవధిలోనే వికెట్ చేజార్చుకోగా.. దినేశ్ కార్తీక్ (0) అక్షర్ పటేల్ (0) చివర్లో విఫలమయ్యారు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా కెప్టెన్ హార్దిక్ పాండ్య (15 నాటౌట్: 9 బంతుల్లో 2x4) సమయోచితంగా ఆడి రెండు బౌండరీలు కొట్టడంతో భారత్ 225 పరుగులు చేయగలిగింది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.