యాప్నగరం

లాస్ట్ బాల్ థ్రిల్లర్.. ఆస్ట్రేలియాపై తొలి టీ20లో ఇంగ్లాండ్ సంచలనం

ఆస్ట్రేలియా విజయానికి చివరి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవగా.. రెండో బంతిని స్టాయినిస్‌ సిక్స్‌గా మలిచేశాడు. కానీ.. ఇంగ్లాండ్ బౌలర్ కరన్‌ ఆ తర్వాత నాలుగు బంతుల్నీ తెలివిగా వేసి..?

Samayam Telugu 5 Sep 2020, 9:06 am
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనకి తిరుగులేదని ఇంగ్లాండ్ మరోసారి నిరూపించింది. ఆస్ట్రేలియాతో సౌథాంప్టన్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ పోరాడిన ఇంగ్లాండ్ టీమ్.. 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 163 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా విజయానికి చివరి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవగా.. స్టాయినిస్ భారీ సిక్స్ కొట్టేశాడు. దాంతో.. మ్యాచ్‌‌లో ఉత్కంఠ నెలకొనగా.. తెలివిగా బౌలింగ్ చేసిన టామ్ కరన్ ఆఖరి ఓవర్‌లో 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్‌ని గెలిపించాడు. దాంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యాన్ని అందుకోగా.. రెండో టీ20 మ్యాచ్‌ సౌథాంప్టన్ వేదికగానే ఆదివారం జరగనుంది.
Samayam Telugu England v Australia


మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (44: 29 బంతుల్లో 5x4, 2x6) మెరుపు ఆరంభాన్నివ్వగా.. అనంతరం వచ్చిన డేవిడ్ మలాన్ (66: 43 బంతుల్లో 5x4, 3x6) హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. దాంతో.. ఒకానొక దశలో ఇంగ్లాండ్ 180పైచిలుకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. డెత్ ఓవర్లలో పుంజుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ 162/7తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాని ఆరంభంలోనే ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (58: 47 బంతుల్లో 4x4), అరోన్ ఫించ్ (46: 32 బంతుల్లో 7x4, 1x6) తిరుగులేని స్థితిలో నిలిపారు. తొలి వికెట్‌కి 11 ఓవర్లలో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. విజయానికి బాటలు వేసింది. కానీ.. మిడిల్ ఓవర్లలో తత్తరపాటు కంగారూలని ముంచింది. స్టీవ్‌స్మిత్ (18), మాక్స్‌వెల్ (1), అలెక్స్ క్యారీ (1), అస్గన్ అగర్ (4) తక్కువ స్కోరుకే ఔటవగా.. ఆఖరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 15 బంతులు అవసరమయ్యాయి. అయితే.. స్టాయినిస్ (23 నాటౌట్: 18 బంతుల్లో 1x6) క్రీజులో ఉండటంతో ఆస్ట్రేలియా ధీమాతో కనిపించింది. కానీ.. ఆ ఓవర్‌‌లో ఆరు బంతుల్నీ ఆడిన స్టాయినిస్ 0, 6, 0, 2, 2, 2 పరుగులతో సరిపెట్టాడు. వరుస యార్కర్లు సంధించిన టామ్ కరన్.. స్టాయినిస్‌ని నిలువరించగలిగాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.