యాప్నగరం

అది నా అలవాటు..! రిషబ్ పంత్ గార్డ్ మార్క్ చెరిపేయడంపై స్టీవ్‌స్మిత్ స్పందన

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ క్రీడాస్ఫూర్తి తప్పి రిషబ్ పంత్ గీసుకున్న గార్డ్ మార్క్‌ని బ్రేక్ టైమ్‌లో చెరిపేశాడు. అయితే.. అది తన అలవాటుగా తాజాగా స్మిత్ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. కానీ..?

Samayam Telugu 13 Jan 2021, 7:56 am
సిడ్నీ టెస్టులో టీమిండియా యువ హిట్టర్ రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ని చెరిపేయడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఎట్టకేలకి స్పందించాడు. సోమవారం ముగిసిన ఈ టెస్టులో లంచ్‌ బ్రేక్‌ నుంచి రిషబ్ పంత్ మళ్లీ క్రీజులోకి వచ్చేలోపు.. అతను అప్పటి వరకూ గీసుకున్న గార్డ్‌ మార్క్‌ని ఉద్దేశపూర్వకంగా స్టీవ్‌స్మిత్ చెరిపేయడం స్టంప్ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది.
Samayam Telugu Steve Smith Controversy (Image Source: Twitter)



మ్యాచ్‌లో అప్పటి వరకూ రిషబ్ పంత్ (97: 118 బంతుల్లో 12x4, 3x6) ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడంతో.. అతని బ్యాటింగ్ లయని దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆ గార్డ్‌ మార్క్‌ని స్టీవ్‌స్మిత్ చెరిపేసినట్లు ఆరోపణలు వినిపించాయి. దాంతో.. క్రీడాస్ఫూర్తి తప్పిన స్టీవ్‌స్మిత్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ.. అలా సెంటర్లో మార్క్ చేయడం తనకి అలవాటు అని తాజాగా వివరణ ఇచ్చుకున్న స్టీవ్‌స్మిత్.. అది తన అలవాటు అని సమర్థించుకున్నాడు. కానీ.. అతని వివరణ ఏమంత నమ్మశక్యంగా అనిపించడం లేదు. స్మిత్ గార్డ్‌మార్క్ చెరిపేసి వెళ్లిన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. మళ్లీ గార్డ్ మార్క్‌ని గీసుకునేందుకు ఫీల్డ్ అంపైర్ సాయం తీసుకోవాల్సి వచ్చింది.

‘‘ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ మా బౌలర్లని ఎలా ఎదుర్కొంటున్నాడు..? మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు..? అని ఊహించుకోవడానికి నేను అలా బ్యాటింగ్ క్రీజులోకి తరచూ వెళ్తుంటా. ఆ సమయంలో నేనే బ్యాటింగ్ చేస్తున్నట్లు ఎప్పుడూ సెంటర్లో మార్క్ చేస్తాను. కానీ.. ఇప్పుడు అదే వివాదంగా మారడం షాక్‌‌తో పాటు నిరాశకీ గురిచేసింది. సిడ్నీ టెస్టులో భారత్ అద్భుత ప్రదర్శన కంటే ఈ గార్డ్ మార్క్ అంశంపై చర్చ జరగడం నిజంగా సిగ్గుచేటు’’ అని స్టీవ్‌స్మిత్ చెప్పుకొచ్చాడు. 2018లో బాల్ టాంపరింగ్‌కి సహకరించిన స్టీవ్‌స్మిత్‌పై ఏడాది నిషేధం పడిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.