యాప్నగరం

డివిలియర్స్ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం వెలుగులోకి..!

అందరూ ఊహించినట్లు ప్రైవేట్ టీ20 లీగ్స్ కోసం అంతర్జాతీయ క్రికెట్‌కి ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించలేదు. అతడ్ని ఓ ఓటమి తీవ్రంగా బాధించింది. ఎన్ని సంచలన ఇన్నింగ్స్‌లు ఆడినా.. ఆ బాధ నుంచి అతను బయటపడలేకపోయాడట.

Samayam Telugu 2 Jul 2020, 5:54 am
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2018 ఐపీఎల్ సీజన్‌లో ఉత్సాహంగా మ్యాచ్‌లాడిన ఏబీ డివిలియర్స్.. టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కి అర్హత సాధించలేకపోవడంతో నిరాశగా స్వదేశానికి వెళ్లాడు. అలా వెళ్లిన రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ క్రికెట్‌కి డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
Samayam Telugu AB de Villiers


కెరీర్ బెస్ట్ ఫామ్‌ని కనబరుస్తున్న దశలో అలా వీడ్కోలు చెప్పడమేంటి..? అని అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. మరికొందరు ప్రైవేట్ టీ20 లీగ్‌లపై ఎక్కువ దృష్టి పెట్టుందుకే ఆ నిర్ణయం తీసుకున్నాడని ఆరోపించారు. దక్షిణాఫ్రికా జట్టు భవితవ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా స్వార్థపూరితంగా రిటైర్మెంట్ ప్రకటించాడంటూ మరి కొంత మంది మాజీ క్రికెటర్లు విమర్శించారు. దాంతో.. 2019 వన్డే ప్రపంచకప్ ముంగిట రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాను అని చెప్పినా.. చాలా మంది మాజీ క్రికెటర్లు అతనికి మద్దతు ఇవ్వలేదు. కానీ.. తన రిటైర్మెంట్ వెనుక ఉన్న అసలు కారణాన్ని తాజాగా ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు.

క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ ‘‘2015 వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఓటమిని నన్ను బాధించింది. దాదాపు 12 నెలల పాటు ఆ కుంగుబాటు నుంచి బయటపడటానికి ప్రయత్నించా. ఆ క్రమంలో జట్టుతో కలిసి మళ్లీ మ్యాచ్‌లాడాను.. బ్యాటింగ్‌లో అత్యుత్తమంగా రాణించా. కానీ.. ఆ ఓటమి నన్ను వెంటాడుతూ వచ్చింది. దాంతో.. నేను ఆ వరల్డ్‌కప్ దగ్గరే ఆగిపోయానని అర్థమైంది. ఆ ఓటమి గురించి ఆలోచించిన ప్రతిసారి ఒంటరినైపోయా అనిపించేది.. నా రిటైర్మెంట్‌లో ఆ పరాజయం క్రియాశీలక పాత్ర పోషించింది’’ అని వెల్లడించాడు. ఆ సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. కానీ.. అక్కడ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.