యాప్నగరం

అశ్విన్ బంతికి మొద్దుబారిన ఫించ్ మెదడు..!

ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌‌లో అశ్విన్ బంతిని డిఫెన్స్ చేయడానికి అరోన్ ఫించ్ విశ్వప్రయత్నం చేశాడు. కానీ.. బంతి అతని బ్యాట్‌కి తాకకుండా.. నేరుగా ఫ్యాడ్స్‌ని తాకి గాల్లోకి లేచింది.

Samayam Telugu 9 Dec 2018, 2:53 pm
భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆదివారం ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈరోజు రెండో సెషన్‌లో భారత్ జట్టు 307 పరుగులకి ఆలౌటవగా.. 323 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయేది.. కానీ.. ఇషాంత్ శర్మ తప్పిదం కారణంగా ఆ వికెట్ చేజారగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే గిప్ట్ రూపంలో అదే వికెట్‌ భారత్‌కి దొరికింది.
Samayam Telugu 99


ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ రెండో బంతికే వికెట్ల ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. కానీ.. అతను అంపైర్ ఔట్ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ డీఆర్‌ఎస్‌కి వెళ్లగా.. ఇషాంత్ శర్మ క్రీజు వెలుపల కాలు పెట్టి బంతి (నోబాల్) విసిరినట్లు రిప్లైలో తేలింది. దీంతో.. అతను నాటౌట్ అని అంపైర్ ప్రకటించాడు (తొలి ఇన్నింగ్స్‌లోనూ తొలి ఓవర్‌ మూడో బంతికే ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఫించ్ క్లీన్‌బౌల్డయిన విషయం తెలిసిందే)
ఆ తర్వాత ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌‌లో అశ్విన్ బంతిని డిఫెన్స్ చేయడానికి అరోన్ ఫించ్ విశ్వప్రయత్నం చేశాడు. కానీ.. బంతి అతని బ్యాట్‌కి తాకకుండా.. నేరుగా ఫ్యాడ్స్‌ని తాకి గాల్లోకి లేచింది. దీంతో.. వికెట్ కీపర్ రిషబ్ పంత్.. సులువుగా క్యాచ్‌ అందుకుని ఔట్ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్ వేలెత్తేశాడు. అయితే.. ఈ ఔట్ నిర్ణయంపై డీఆర్‌ఎస్‌కి వెళ్లాలని తొలుత యోచించిన అరోన్ ఫించ్.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మరో ఓపెనర్ హారిస్ సలహా కూడా తీసుకున్నాడు. కానీ.. మళ్లీ ఏమి ఆలోచించాడో ఏమో..? డీఆర్‌ఎస్ అడగకుండానే పెవిలియన్ వైపు నడించాడు. రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకలేదని తేలింది.
ఈ మ్యాచ్‌లో ఈరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 104/4తో నిలవగా.. ఆ జట్టు విజయానికి ఇంకా 219 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్‌లో ఆఖరిరోజైన సోమవారం 6 వికెట్లు చేతిలో ఉన్న ఆస్ట్రేలియా ఏ మేరకు భారత్‌పై పోరాడుతుందో..? చూడాలి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.