యాప్నగరం

విరాట్ కోహ్లీ గైర్హాజరీతో అతనిపై అదనపు ఒత్తిడి: పాంటింగ్

ఆస్ట్రేలియాని దాని సొంతగడ్డపై టెస్టుల్లో ఓడించాలంటే అంత సులువుకాదు. దానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి మూడు టెస్టులకీ దూరంగా ఉండనున్నాడు. ఆ ప్రభావం బ్యాటింగ్ ఆర్డర్‌పైనా పడనుంది.

Samayam Telugu 20 Nov 2020, 8:52 am
ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లిపోవడంతో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానెపై అదనపు ఒత్తిడి పడుతుందని ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుండగా.. తొలి టెస్టు ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ భారత్‌కి వచ్చేయనున్నాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరిలో బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో ఇప్పటికే బీసీసీఐ అతనికి పితృత్వ సెలవుల్ని కూడా కేటాయించేసింది. దాంతో.. చివరి మూడు టెస్టుల్లో భారత్‌ ఎన్నో సవాళ్లని ఎదుర్కోబోతోందని పాంటింగ్ జోస్యం చెప్పాడు.
Samayam Telugu Virat Kohli, Ajinkya Rahane (Image Credits: AFP)


‘‘విరాట్ కోహ్లీ లేని టీమిండియా చివరి మూడు టెస్టుల్లో ఎలా ఆడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అతని గైర్హాజరీ అజింక్య రహానెతో పాటు చాలా మంది ఆటగాళ్లపై ఒత్తిడి పెంచనుంది. మరీ ముఖ్యంగా.. కెప్టెన్సీని తీసుకోబోతున్న రహానెపై ఆ ఒత్తిడి ప్రభావం అధికంగా ఉండనుంది. కోహ్లీ లేకపోతే ఆ నెం.4 స్థానంలో ఎవరిని ఆడించాలి..? మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మూడో పేసర్‌గా ఎవరిని టీమ్‌లోకి తీసుకోవాలి. ఇషాంత్ శర్మకి అవకాశమివ్వాలా లేదా నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్‌లో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలా..? అనేదానిపై ఇప్పటికీ టీమిండియాలో క్లారిటీ లేదు’’ పాంటింగ్ వెల్లడించాడు.

ఆస్ట్రేలియా పర్యటనకి 2018-19లో వెళ్లిన టీమిండియా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది. అయితే.. అప్పట్లో డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ నిషేధం కారణంగా జట్టులో లేకపోవడంతో భారత్ పని సులువైంది. కానీ.. ఇప్పుడు ఆ ఇద్దరూ జట్టులో ఉన్నారు. మరోవైపు భారత్‌ జట్టుకి కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంకానున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.