యాప్నగరం

బ్రిస్బేన్ టెస్టులో క్యాచ్ వదిలేసిన రహానె.. వెంటనే మైదానం వీడిన బౌలర్ సైనీ

బ్రిస్బేన్ టెస్టులో లబుషేన్‌ని ఔట్ చేసే సులువైన అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. చేతుల్లో పడిన క్యాచ్‌ని తత్తరపాటులో కెప్టెన్ అజింక్య రహానె నేలపాలు చేశాడు. దాంతో..?

Samayam Telugu 15 Jan 2021, 10:58 am
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానె ఫీల్డింగ్ తప్పిదానికి పాల్పడ్డాడు. ఇన్నింగ్స్ 36వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా కట్ చేసేందుకు మార్కస్ లబుషేన్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గల్లీ దిశగా గాల్లోకి లేచింది. కానీ.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అజింక్య రహానె బంతిని ఒడిసి పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఆ బంతి తర్వాత మైదానం నుంచి నవదీప్ సైనీ వెళ్లిపోయాడు. మళ్లీ బౌలింగ్‌కి రాలేదు. అప్పటికి లబుషేన్ 108 బంతుల్లో 37 పరుగులు చేశాడు.
Samayam Telugu Ajinkya Rahane (Image Source: Twitter)



వాస్తవానికి అజింక్య రహానె మెరుగైన ఫీల్డర్. గ్రౌండ్‌లో ఏ ప్లేస్‌లోనైనా ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంటాడు. కానీ.. బ్రిస్బేన్ టెస్టులో చేతుల్లో పడిన బంతిని తత్తరపాటులో వదిలేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. బౌలర్ నవదీప్ సైనీ కూడా నమ్మలేనట్లు పిచ్ మధ్యలోనే తల వాల్చేశాడు. అదే సమయంలో అతని తొడ కండరాలకి గాయమవడంతో.. ఆ ఓవర్‌లో చివరి బంతిని కూడా వేయకుండా సైనీ వెళ్లిపోయాడు. దాంతో.. ఆ ఒక్క బంతిని రోహిత్ శర్మ వేయాల్సి వచ్చింది.


రహానె జీవనదానం ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్న లబుషేన్ ప్రస్తుతం 174 బంతుల్లో 78 పరుగులతో కొనసాగుతున్నాడు. దాంతో.. 57 ఓవర్లలో ఆస్ట్రేలియా 163/3తో కొనసాగుతుండగా.. అతనితో పాటు క్రీజులో మాథ్యూవెడ్ (31 బ్యాటింగ్: 68 బంతుల్లో 5x4) ఉన్నాడు. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ గాయపడి సిరీస్‌కి దూరమవగా.. తాజాగా ఆ జాబితాలో సైనీ కూడా చేరిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.