యాప్నగరం

Ind vs Aus: సవాల్ విసిరిన ఆసీస్ బౌలర్లు ‘సెంచరీ’ దాటేశారు..!

భారత్ బ్యాట్స్‌మెన్‌ని కవ్వించడంలో తెగ ఉత్సాహం చూపిస్తూ వచ్చిన మిచెల్ స్టార్క్.. కనీసం ఒక మెయిడిన్ ఓవర్‌ కూడా వేయలేకపోగా.. ఏకంగా 123 పరుగులు సమర్పించుకున్నాడు.

Samayam Telugu 4 Jan 2019, 2:38 pm
భారత బ్యాట్స్‌మెన్‌కి సవాల్ విసిరిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లందరూ సిడ్నీ టెస్టులో ‘సెంచరీ’ మార్క్‌ని దాటేశారు. టెస్టు సిరీస్‌కి ముందు విరాట్ కోహ్లీ‌తో సహా అందర్నీ కట్టడి చేస్తామని.. బౌన్సర్లతో వారిని క్రీజులో కుదురుకోనియ్యమని బీరాలు పలికిన కంగారూ జట్టు పేసర్లు.. ఈరోజు చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జోరుకి చేతులెత్తేశారు. ఎంతలా అంటే ఆ జట్టు అగ్రశ్రేణి బౌలర్‌గా చెప్పుకొనే మిచెల్ స్టార్క్ ఏకంగా 123 పరుగులు సమర్పించుకోగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్ నాథన్ లయన్ అయితే.. 178 పరుగులిచ్చేశాడు.
Samayam Telugu 5


ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌ నైట్ స్కోరు 303/4తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా భారీ స్కోరుపై కన్నేసి తొలి సెషన్ నుంచి దూకుడు మొదలెట్టింది. నిన్న శతకం మార్క్‌ని అందుకున్న చతేశ్వర్ పుజారా (193: 373 బంతుల్లో 22x4) ఈరోజు కొద్దిలో డబుల్ సెంచరీని చేజార్చుకోగా.. రిషబ్ పంత్ (159 నాటౌట్: 189 బంతుల్లో 15x4, 1x6) వన్డే తరహా ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. అతనికి తోడుగా రవీంద్ర జడేజా (81: 114 బంతుల్లో 7x4, 1x6) కూడా బ్యాట్ ఝళిపించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ని 622/7తో డిక్లేర్ చేసింది. పంత్- జడేజా జోడీ ఏడో వికెట్‌కి 204 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.

మ్యాచ్‌లో 26 ఓవర్లు వేసిన మిచెల్ స్టార్క్ 123 పరుగులిచ్చి రహానె వికెట్ పడగొట్టగా.. 35 ఓవర్లు వేసిన హేజిల్‌వుడ్ 105 పరుగులిచ్చి కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పాట్ కమిన్స్ అయితే.. 28 ఓవర్లు వేసి 101 పరుగులు ఇచ్చినా.. కనీసం ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే.. స్పిన్నర్ నాథన్ లయన్ మాత్రం 178 పరుగులిచ్చి.. మయాంక్, పుజారా, విహారి, జడేజా రూపంలో నాలుగు వికెట్లు పడగొట్టగలిగాడు. భారత్ బ్యాట్స్‌మెన్‌ని కవ్వించడంలో తెగ ఉత్సాహం చూపిస్తూ వచ్చిన మిచెల్ స్టార్క్.. కనీసం ఒక మెయిడిన్ ఓవర్‌ కూడా వేయలేకపోవడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.