యాప్నగరం

లక్ అంటే నటరాజన్‌దే.. భారత క్రికెట్‌లో ఏ ఆటగాడికీ ఆ ఛాన్స్ దక్కలేదు

ఆస్ట్రేలియా టూర్‌కి అనూహ్యంగా ఎంపికైన నటరాజన్‌ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. తొలుత టీ20ల్లోకి మాత్రమే ఎంపికైన ఈ ఎడమచేతి వాటం పేసర్ టీ20లతో పాటు వన్డే, టెస్టుల్లోకీ అరంగేట్రం చేసేశాడు. ఇలా ఒకే టూర్‌లో..?

Samayam Telugu 15 Jan 2021, 11:37 am
టీమిండియా ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా శుక్రవారం ఆరంభమైన నాలుగో టెస్టుతో భారత్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్.. ఒకే టూర్‌లో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. మూడో టెస్టు ఆడిన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ అశ్విన్ గాయపడటంతో నటరాజన్, శార్ధూల్ ఠాకూర్‌కి నాలుగో టెస్టులో టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది.
Samayam Telugu Natarajan (Image Source: Twitter)


వాస్తవానికి ఈ టెస్టు సిరీస్‌కి నటరాజన్‌ నెట్స్ బౌలర్‌‌గా మాత్రమే ఎంపికయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియా టూర్‌కి అతని ఎంపికే అనూహ్యం. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తొలుత భారత సెలెక్టర్లు టీ20 జట్టులోకి ఎంపిక చేయగా.. టూర్‌ ముంగిట అతను గాయపడ్డాడు. దాంతో.. అతని స్థానంలో నటరాజన్‌కి అవకాశం కల్పించారు. అయితే.. ఆశ్చర్యకరంగా తొలుత ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలోనే నటరాజన్‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ ఛాన్సిచ్చింది. ఆ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన నటరాజన్ 70 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.


వన్డేల్లో రాణించడంతో ఆ తర్వాత టీ20 సిరీస్‌లోనూ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నటరాజన్‌కి అవకాశం లభించింది. ఆ సిరీస్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్.. తన వేరియేషన్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. దాంతో.. వన్డే, టీ20 సిరీస్ ముగిసినా.. నటరాజన్‌ని స్వదేశానికి పంపకుండా నెట్స్ బౌలర్‌గా వినియోగించుకునేందుకు అక్కడే టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంచేసుకుంది. ఇప్పుడు అదే అతనికి వరమైంది. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్ , జడేజా వరుసగా టెస్టు సిరీస్‌లో గాయపడటంతో.. నటరాజన్‌కి టెస్టుల్లో ఆడే ఛాన్స్ లభించింది. మొత్తానికి ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్లలోనూ అతను అరంగేట్రం చేయగలిగాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.