యాప్నగరం

కోహ్లీకి అదొక పీడకల.. చూస్తూ తాను కూడా తప్పులో కాలేశాడు: లతీఫ్ ఎద్దేవా

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు ఆఫ్ స్టంప్ లైన్‌పై బంతులు విసరడం.. వాటిని ఆడేందుకు ప్రయత్నిస్తూ భారత బ్యాట్స్‌మెన్‌లు స్లిప్‌ లేదా కీపర్‌కి క్యాచ్ ఇవ్వడం.. టీమ్‌లోని ముప్పావు శాతం ఆటగాళ్లు ఒకే తరహాలో ఔటవడమా..?

Samayam Telugu 21 Dec 2020, 1:45 pm
ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన తొలి టెస్టు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ పీడకలగా మిగిలిపోనుందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఎద్దేవా చేశాడు. అడిలైడ్ వేదికగా జరిగిన ఆ టెస్టు మ్యాచ్‌‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల దెబ్బకి భారత్ జట్టు కేవలం 36 పరుగులకే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. టీమ్‌లోని ఏ బ్యాట్స్‌మెన్ కూడా కనీసం రెండంకెల స్కోరుని కూడా అందుకోలేకపోగా.. టీమ్‌లో మప్పావు శాతం ఆటగాళ్లు వికెట్ కీపర్ లేదా స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. టాప్ ఆర్డర్ ఒక ఎండ్‌‌లో కుప్పకూలుతున్నా... విరాట్ కోహ్లీ కూడా సాహసోపేతంగా షాట్ ఆడేసి వికెట్ చేజార్చుకోవడం తనని ఆశ్చర్యపరిచిందని లతీఫ్ చెప్పుకొచ్చాడు.
Samayam Telugu Virat Kohli (Image Credit: Reuters)


‘‘ఈ రోజుల్లో బౌలర్లు 100 శాతం బంతిని సరైన ప్రదేశంలో విసరగలిగితే..? అది బ్యాట్ ఎడ్జ్‌లను తాకుతూ ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. భారత్ జట్టు అంతలా కుప్పకూలడానికి కారణం.. ఆస్ట్రేలియా బౌలింగ్‌‌ని అటాక్ చేయాలనే మైండ్‌సెట్‌తో ఆడటమే. కానీ.. పిచ్ మూడో రోజుకి పూర్తిగా మారిపోయి.. బౌలర్లకి సహకరించింది. విరాట్ కోహ్లీ ఒక ఎండ్‌లో నిలబడి వికెట్ల పతనాన్ని చూశాడు. అయినప్పటికీ.. తానూ కూడా టెంప్ట్ అయ్యి వైడ్‌గా వెళ్తున్న బంతిని వెంటాడి ఔటయ్యాడు. భారత్ జట్టు 36 పరుగులకే ఆలౌటవడం కచ్చితంగా విరాట్ కోహ్లీకి పీడకలే’’ అని లతీఫ్ చెప్పుకొచ్చాడు.

డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. పితృత్వ సెలవులు తీసుకుని త్వరలోనే భారత్‌కి కోహ్లీ వచ్చేయనున్నాడు. దాంతో.. మిగిలిన మూడు టెస్టులకి అజింక్య రహానె కెప్టెన్‌గా భారత్ జట్టుని నడిపించనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.