యాప్నగరం

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ నుంచి మహ్మద్ షమీ ఔట్..?

అడిలైడ్ టెస్టులో అవమానకరరీతిలో పరాజయాన్ని చవిచూసిన భారత్ జట్టు.. సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది. కానీ.. రెండో టెస్టుకి కోహ్లీ దూరం కాబోతుండగా.. మహ్మద్ షమీ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.

Samayam Telugu 20 Dec 2020, 7:55 am
ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో ఓడిపోయిన టీమిండియాకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటింగ్ చేస్తూ గాయపడిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.. సిరీస్ మొత్తానికీ దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ విసిరిన షార్ట్ పిచ్ బంతి వేగంగా వెళ్లి మహ్మద్ షమీ కుడి మోచేతికి తగిలింది. దాంతో.. నొప్పితో విలవిలలాడిపోయిన షమీ.. ఫిజియో సాయం తీసుకున్నప్పటికీ బ్యాటింగ్‌ని కొనసాగించలేకపోయాడు. దాంతో.. రిటైర్ట్ హర్ట్‌గా అతను వెనుదిరగగా.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.
Samayam Telugu Mohammed Shami Injury (Image Credit: AP)


మహ్మద్ షమీ గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. స్కానింగ్ తీయగా.. అతని మణికట్టులో పగుళ్లు వచ్చినట్లు తేలింది. దాంతో.. కొన్ని వారాల పాటు క్రికెట్‌కి షమీ దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. కానీ.. బీసీసీఐ మాత్రం ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది. ఒకవేళ మహ్మద్ షమీ సిరీస్‌కి దూరమైతే..? హైదరాబాద్‌కి చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అతని స్థానంలో ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ సిరాజ్ భారత్ తరఫున కనీసం ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.

డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈరోజు లేదా రేపు పితృత్వ సెలవులు తీసుకుని భారత్‌కి విరాట్ కోహ్లీ వచ్చేయనున్నాడు. ఇక మహ్మద్ షమీ కూడా సిరీస్‌కి దూరమైతే..? టీమిండియా మరింత బలహీనపడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై మొత్తం నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.