యాప్నగరం

WTC Finalలో ఆఖరి రోజు గుడ్‌న్యూస్.. రిజర్వ్ డే‌లో ఆ టెన్షన్‌ లేదు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ని మొదటి రోజు నుంచి వెంటాడుతున్న వరుణుడు ఈరోజు కాస్త కరుణించేలా కనిపిస్తున్నాడు. ఈ ఫైనల్ రిజర్వ్ డేకి చేరుకోగా.. మ్యాచ్ ఫలితం తేలడం అనుమానంగానే కనిపిస్తోంది.

Samayam Telugu 23 Jun 2021, 12:14 pm

ప్రధానాంశాలు:

  • భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఈరోజే ఆఖరి
  • సౌథాంప్టన్ వాతావరణం అప్‌డేట్.. వర్షం టెన్షన్ లేదు
  • రిజర్వ్ డే రూపంలో ఈరోజు ఆటని కొనసాగిస్తున్న ఐసీసీ
  • మ్యాచ్ డ్రాగా ముగిసే సూచనలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Virat Kohli (Pic Credit: Reuters)
భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే మ్యాచ్‌లో ఐదు రోజులు ముగియగా.. రిజర్వ్ డే రూపంలో ఆరో రోజైన బుధవారం కూడా మ్యాచ్‌ని ఐసీసీ కొనసాగించబోతోంది. వర్షం కారణంగా శుక్రవారం, సోమవారం ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోగా.. రిజర్వ్ డే తెరపైకి వచ్చింది. అయితే.. నిమిషాల వ్యవధిలోనే సౌథాంప్టన్‌లో వాతావరణం మారిపోతుండటంతో.. బుధవారం వాతావరణ పరిస్థితి ఏంటి..? అని అభిమానులు తెగ శోధిస్తున్నారు.
మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్ 249 పరుగులకి కుప్పకూలింది. దాంతో.. కివీస్‌కి 32 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. మంగళవారం ఆట ముగిసే సమయానికి 64/2తో నిలిచింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (8 బ్యాటింగ్: 12 బంతుల్లో), చతేశ్వర్ పుజారా (12 బ్యాటింగ్: 55 బంతుల్లో 2x4) ఉన్నారు. ఓపెనర్లు శుభమన్ గిల్ (8: 33 బంతుల్లో), రోహిత్ శర్మ (30: 81 బంతుల్లో 2x4)లను టిమ్ సౌథీ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసేశాడు. భారత్ జట్టు ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో ఉంది.

సౌథాంప్టన్‌లో బుధవారం వర్షం పడే సూచనలు ఏమీ కనిపించడం లేదు. సూర్యుడు దర్శనమిస్తాడని.. అయితే.. అప్పుడప్పుడు మబ్బులతో కూడిన వాతావరణం మాత్రం ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా.. గత ఐదు రోజులతో పోలిస్తే ఈరోజు మెరుగైన వాతావరణం సౌథాంప్టన్‌లో ఉంటుందని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.