యాప్నగరం

కివీస్‌తో రెండో టెస్టులో భారత్ 242 ఆలౌట్

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200 పరుగులలోపే ఆలౌటైన టీమిండియా.. రెండో టెస్టులో ఎట్టకేలకి గౌరవప్రదమైన స్కోరుని అందుకోగలిగింది. ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

Samayam Telugu 29 Feb 2020, 10:48 am
న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో భారత్ జట్టు 242 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. పృథ్వీ షా (54: 64 బంతుల్లో 8x4, 1x6), చతేశ్వర్ పుజారా (54: 140 బంతుల్లో 6x4), హనుమ విహారి (55: 70 బంతుల్లో 10x4) హాఫ్ సెంచరీలు బాదడంతో మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), వైస్‌ కెప్టెన్ అజింక్య రహానె (7), రిషబ్ పంత్ (12: 14 బంతుల్లో 2x4) చేతులెత్తేయడంతో భారత్ 242 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Samayam Telugu New Zealand v India - Second Test


undefined

మ్యాచ్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (7) ఆరంభంలోనే ఔటైనా.. పృథ్వీ షా బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ.. హాఫ్ సెంచరీ తర్వాత పృథ్వీ షా ఔటవగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె పేలవరీతిలో టిమ్ సౌథీ బౌలింగ్‌లో వికెట్లు సమర్పించుకున్నారు. ఈ దశలో హనుమ విహారితో కలిసి భారత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసిన చతేశ్వర్ పుజారా ఐదో వికెట్‌కి 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో.. భారత్ మళ్లీ పుంజుకునేలా కనిపించింది.


కానీ.. జట్టు స్కోరు 194 వద్ద విహారి ఔటవగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే పుజారా కూడా జెమీషన్ బౌలింగ్‌లో ఔటైపోయాడు. దీంతో.. భారత్‌లో మళ్లీ తడబాటు మొదలైంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరోసారి పేలవ ఇన్నింగ్స్‌తో నిరాశపరచగా.. అశ్విన్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన రవీంద్ర జడేజా (9), ఉమేశ్ యాదవ్ (0) హిట్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ వికెట్ చేజార్చుకున్నారు. అయితే.. ఆఖర్లో మహ్మద్ షమీ (16: 12 బంతుల్లో 1x4, 2x6), జస్‌ప్రీత్ బుమ్రా (10 నాటౌట్: 10 బంతుల్లో 1x4) బ్యాట్ ఝళిపించి విలువైన పరుగులు జోడించారు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ ఆఖర్లో వరుసగా 6, 6 బాది ఆ వెంటనే ఔటైపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.